జగనన్న వచ్చేదాకా పార్టీ మిగిలుంటుందా?

జగన్మోహన్ రెడ్డికి పార్టీని కాపాడుకోవాలనే ఆలోచన ఎట్టకేలకు వచ్చినట్టుగా ఉంది. ఆయన కాస్త దృష్టి సారించారు. ఒకవైపు పార్టీ నుంచి సీనియర్ నాయకులు అందరూ ఎడాపెడా బయటకు వెళ్లిపోతున్నారు. పార్టీలో మిగిలి ఉన్న వారు కూడా ఎవరూ పార్టీ కార్యకలాపాలను పట్టించుకుంటున్న వారు కాదు. చాలా మంది సైలెంట్ గా తమ తమ వ్యాపారాలు చూసుకుంటూ గడిపేస్తున్నారు. పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టాలంటే.. తాడేపల్లి నుంచి ఫోను చేసి అడిగితే తప్ప నాయకులు ముందుకు రావడం లేదు. చాలా మంది మొహం చాటేస్తున్నారు. ఇన్ని రకాల ఇబ్బందుల మధ్య పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే.. జగన్ చాలా పెద్ద ప్రణాళిక వేసుకున్నారు. జిల్లాల్లో పర్యటించి, నాయకులతో స్వయంగా టచ్ లోకి వెళ్లి వారినందరినీ తిరిగి ట్రాక్ మీదికి తెస్తారట. అయితే ఇందుకోసం ఆయన నిర్ణయించుకున్న ముహూర్తమే అందరికీ నవ్వు తెప్పిస్తోంది.

వచ్చే ఏడాది జనవరి నెలాఖరులోగానీ, లేదా మార్చి నెలలో గానీ   జగనన్న జిల్లా పర్యటనలు ప్రారంభిస్తారట. నాయకులను బుజ్జగించి, బతిమాలి పార్టీకోసం తిరిగి వారు పనిచేసేలా ప్రేరేపిస్తారట. అలాగే ఎన్నికల తర్వాత.. ప్రభుత్వ వేధింపులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెబుతారట.

అయితే సాధారణ కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో మెదలుతున్న సందేహం ఒకటుంది. పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఒక్కరొక్కరుగా వెళ్లిపోతున్నారు. జగన్ ఇప్పుడంతా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుని.. వచ్చే ఏడాది జనవరి చివరిలోనో, మార్చిలోనో జిల్లాలయాత్రకు బయలుదేరుతాను.. మీరంతా జనాన్ని రోడ్ల పక్క నిల్చుని నాకు చేతులు ఊపేలాగా తీసుకురండి.. అని పురమాయించేలా ప్లాన్ చేయడం కార్యకర్తలకు చిరాకు తెప్పిస్తోంది. అసలు అప్పటిదాకా పార్టీ బతికుంటుందా? జగనన్నా అని వారు ప్రశ్నిస్తున్నారు. సమస్య ఎప్పుడుంటే అప్పుడు దాని పరిష్కారం గురించి ప్రయత్నించాలి గానీ.. నాకు తీరిక ఉన్నప్పుడు పట్టించుకుంటా.. అంటే అప్పటిదాకా సమస్య ఉండదు, పార్టీ కూడా మిగలదు అని వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories