జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున గెలిచి, ఆయన అరాచక పోకడలకు విసిగి, ఆయన ప్రభుత్వం మీద ఐదేళ్లపాటు పోరాడిన నాయకుడు.. కలిదిండి రఘురామ కృష్ణంరాజు! నరసాపురం ఎంపీగా పెద్ద పదవిలో ఉన్నప్పటికీ కూడా.. రఘురామను జగన్ సర్కార్ టార్గెట్ చేసింది. వారం వారం రచ్చబండ లైవ్ కార్యక్రమం ద్వారా రఘురామ , జగన్ ప్రభుత్వ అరాచక విధానాలను, దుర్మార్గపు నిర్ణయాలను ఉతికి ఆరేసేవారు.
ఆయన నిజాలు మాట్లాడడం సహించలేని జగన్ సర్కారు కక్ష పెంచుకుంది. ఆయన మీద రకరకాల కేసులు బనాయించింది. ఆయన ప్రస్తుతం పెట్టిన కేసులు ఇస్తున్న సంకేతాలు ప్రకారం.. ప్రభుత్వం పోలీసు, సిఐడి వ్యవస్థల ద్వారా రఘురామను చంపించడానికే ప్రయత్నించింది.
హైదరాబాదు తన నివాసంలో ఉన్న రఘురామను చాలా అరాచకంగా అరెస్టు చేసి సిఐడి పోలీసులు తీసుకు వెళ్లారు. ఆ రాత్రంతా తీవ్రంగా హింసించారు. మొహాలకి మాస్కులు ధరించి, లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఛాతీపై పోలీసులు కూర్చుని, ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపడానికి ప్రయత్నించారని కూడా రఘురామ ఆరోపించారు. అప్పట్లో పలు విడతలుగా ఆయన న్యాయపోరాటం చేశారు గానీ.. ఏదీ ఒక కొలిక్కి రాలేదు.
ఈ ఎన్నికల సమయానికి రఘురామ నరసాపురం ఎంపీ టికెట్ ఆశించినా పొత్తుల్లో బిజెపికి పోవడంతో నిరాశ తప్పలేదు. జగన్ దుర్మార్గాల మీద అలుపెరగని పోరాటాలు సాగించిన రఘురామకు.. న్యాయం చేసే ఉద్దేశంతో చంద్రబాబు ఉండి ఎంఎల్ఏ టికెట్ ఇచ్చారు. రఘురామ తాను అసెంబ్లీ స్పీకరు కావాలని కలగన్నారు.
రకరకాల సమీకరణాల వల్ల అవేమీ ఫలించలేదు. జగన్ ప్రభుత్వం తనను చంపడానికి ప్రయత్నించింది అంటూ ఇప్పుడు సిఐడి కేస్ పెట్టారు. అప్పటి సిఐడి చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు జీజీహెచ్ సూపర్నెంటు అందరిమీదా కేసు పెట్టారు. ఆయన మీద జరిగిన హత్య యత్నానికి సంబంధించి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా లేదా అని ప్రజలు అనుకుంటున్నారు.