టీటీడీకి లడ్డూ తయారీకోసం నెయ్యి సరఫరా కాంట్రాక్టు పొందిన డెయిరీతో పాటు, తెరవెనుక నుంచి కల్తీ బాగోతం నడిపించిన మరో రెండు డెయిరీలను కూడా కలిపి యజమానులు ముగ్గురిని అరెస్టు చేసిన తర్వాత.. విచారణ మరింత వేగం పుంజుకుంటున్నది. కల్తీ నెయ్యి సరఫరాపై రాష్ట్రప్రభుత్వం ఒక సిట్ ను ఏర్పాటుచేస్తే.. దానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించి.. సీబీఐ డైరక్టర్ సారథ్యంలో మరో సిట్ ఏర్పాటుకు ఉత్తర్వులు తీసుకురాగలిగారు.. టీటీడీ పూర్వ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి.
ఆ వైవీ సుబ్బారెడ్డే ఇప్పుడు సిట్ విచారణను ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తోంది. ఈ నలుగురు యజమానుల అరెస్టు తర్వాత.. వీరికి సహకరించిన టీటీడీ ప్రముఖులు ఎవరు? బోర్డు లోని వారేనా? ఇతరులా? అనే దిశగా దర్యాప్తు సాగబోతున్నది. ఈ సిట్ కు పర్యవేక్షణ వహిస్తున్న సీబీఐ చీఫ్ వారం రోజుల్లో తిరుపతికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అప్పటి టీటీడీ పాలకవర్గం పెద్దలను కూడా ప్ర;శ్నిస్తారని తెలుస్తోంది. ఈ వివరాలను బట్టి.. వైవీసుబ్బారెడ్డి సిట్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే.. కీలక చర్చనీయాంశం ఏమిటంటే.. సిట్ విచారణ అనేది కేవలం వైవీ సుబ్బారెడ్డి వరకే ఆగుతుందా? అంతకంటె లోతుగా వెళ్లి.. వైసీపీ సర్కారులోని ఇతర పెద్దల బాగోతాలు కూడా వెలికివస్తాయా? అనేది మాత్రమే!
కల్తీ నెయ్యి సరఫరా కేసుల్లో అసలు కాంట్రాక్టు పొందిన తమిళనాడులోని ఏఆర్ డెయిరీ ని ప్రధాన నిందితుడిగా చూడాలి.
అయితే తెరవెనుక నుంచి వైష్ణవి డెయిరీ, భోలేబాబా డెయిరీలు కథ నడిపించాయి. అసలు ఏఆర్ డెయిరీకి టెండరు దక్కడంలోనే అనేక లోపాయికారీ వ్యవహారాలు సాగినట్టుగా సిట్ విచారణలో తేలింది. అనేక నిబంధనలను తుంగలో తొక్కి వారికి టెండరు కట్టబెట్టారనేది ప్ధాన ఆరోపణ. వారికి సరఫరా కాంట్రాక్టుకు తగినంత నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినప్పటికీ.. టెండరు నిబంధనలన్నింటినీ సవరించి మరీ.. కట్టబెట్టినట్టుగా వెలుగులోకి వచ్చింది.
ఇంతగా నియమనిబంధనలను మీరి ఏఆర్ డెయిరీకి టెండరు ఇవ్వడం ఎవరి కళ్లలో ఆనందం కోసం జరిగింది? అనేది ఇప్పుడు లెక్క తేలాల్సి ఉంది. లడ్డూ తయారీకి వాడే నెయ్యి కాంట్రాక్టు అనేది కేవలం అధికారుల స్థాయిలో జరిగిపోయే నిర్ణయం అనుకోవడానికి వీల్లేదు. అప్పటి టీటీడీ పాలకవర్గంలోని వారి పాత్ర ఖచ్చితంగా ఉంటుందనే పలువురు అనుమానిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డికి తెలియకుండా ఇంత పెద్ద వ్యవహారం.. కేవలం సభ్యుల స్థాయి పైరవీలతో కూడా జరిగేది కాదని పలువురు అంటున్నారు. అందుకే సిట్ చీఫ్ హోదాలో సీబీఐ చీఫ్ తిరుపతి వచ్చిన తర్వాత.. వైవీ సుబ్బారెడ్డిని కూడా పిలిచి విచారిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అంతిమంగా వైవీ వరకు మాత్రమే విచారణ ఆగుతుందా.. ప్రభుత్వంలోనే ఇతర పెద్దలు వైవీ ద్వారా చక్రం తిప్పారా? అనేది కూడా బయటకు రావాల్సి ఉంది.