కాకాణి దొంగాటకు బహుమతి దక్కుతుందా?

ఏపీలో ప్రస్తుతం దొంగ-పోలీస్ ఆట నడుస్తోంది. చెట్టు చాటున నిల్చుని అంకెలు లెక్క బెట్టిన పోలీసులు ఎప్పుడూ.. దాక్కున్న వారిని వెతికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పోలీసు రాకను జాగ్రత్తగా గమనిస్తున్న దొంగలు మాత్రం.. ఏ చెట్టు చాటునో పుట్ట చాటునో దాక్కుంటూ ఉంటారు. ఆట ఇలా సాగిపోతూ ఉంటుంది. రాజకీయంలో కూడా ఇలాంటి ఆటనే నడుస్తూ ఉంది. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పోలీసులతో  దాగుడుమూతల ఆట ఆడుతున్నారు. ఈ ఆటలో ఆయన ఆశిస్తున్న అదిపెద్ద గెలుపు.. వారికి దొరక్క ముందే బెయిలు తెచ్చుకోవడం. రోజుల తరబడి ఇంత కష్టపడి ఆట ఆడుతున్నందుకు ఆయనకు గెలుపు దక్కుతుందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ తవ్వకాలకు సంబంధించి.. ఆయనమీద పలుకేసులు నమోదై ఉన్నాయి.  ఆ బాగోతాలు బయటకు వచ్చిన తొలిరోజుల్లో.. కాకాణి చాలా ప్రగల్భాలు పలికారు. ఇలాంటి కేసులకు బెదిరేది లేదని బీరాలు పోయారు. తీరా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించిన తొలినాటినుంచి.. ఇప్పటిదాకా కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. పిల్లి పిల్లలను తీసుకుని ఇల్లిల్లూ మారినట్టుగా.. నెల్లూరులోని రెండు ఇళ్లకూ తాళాలు వేసి పారిపోయిన కాకాణి గోవర్దన రెడ్డి.. హైదరాబాదులోని మిత్రులు, బంధువుల ఆశ్రయంలో ఉంటూ.. ప్రతిరోజూ మకాం మారుస్తూ తిరుగుతున్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాదులోనే పోలీసు బృందాలు మకాం వేసి.. ఆయనను విచారణకు ఆహ్వానించడానికి నోటీసులతో సిద్ధంగా ఉన్న పోలీసులకు మాత్రం ఆయన చిక్కడం లేదు.

అదే సమయంలో తన న్యాయవాదులతో ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ నడుపుతున్నారు. ఆయన మీద ఉన్న కేసుల్లో ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉన్నందున ముందుగా ప్రత్యేక కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని, నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదని పోలీసుల తరఫు న్యాయవాదులు చెబుతుండగా.. కాకాణి న్యాయవాదులు మాత్రం కాకాణి మీద కేసులకు అసలు ఎస్సీ ఎస్టీ కేసు వర్తించనే వర్తించదని వాదిస్తున్నారు. కేసులో వాదప్రతివాదాలు సాగినంత కాలమూ.. పాపం కాకాణి ప్లేసులు మారుతూ పోలీసులకు దొరక్కుండా గడపాల్సి వస్తోంది.

కాకాణి ముందస్తు బెయిలు పిటిషన్ లో ఇరువర్గాల వాదనలు విన్నటువంటి హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. నోటీసులు అందుకుని విచారణకు హాజరైతే చాలు.. తనను అరెస్టు చేసి తీరుతారని కాకాణి ఆవేదన చెందుతుండగా.. రిజర్వు అయిన తీర్పు ఆయనకు ఊరట ఇస్తుందో లేదో అని పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories