వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన అరాచక శక్తుల్లో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు. కుటుంబంలోని రచ్చను తనంత తానుగా బజారుకీడ్చి.. కేవలం తమ కుటుంబం పరువు మాత్రమే కాదు.. పార్టీ పరువును కూడా బజార్లో పెట్టిన వ్యక్తి ఆయన! భార్యతో విభేదాలు పెట్టుకుని, ప్రియురాలితో జీవితం గడపడమే తనకు ప్రయారిటీ అని.. దానివల్ల ఎవరు ఏం అనుకున్నా ఖాతరు చేసేది లేదని.. ఆయన పలుమార్లు వ్యాఖ్యానించారు. ఆయన కేవలం ఒక వ్యక్తి కాకపోవడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల్లో ఒకడు కావడం వల్ల.. పార్టీ కొన్ని విమర్శలు ఎదుర్కొంది.
అయితే ఇక్కడ ప్రజల్లోనే కాదు.. పార్టీ కార్యకర్తల్లో కూడా వ్యక్తమవుతున్న సందేహం ఒకటి ఉంది. దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినంత మాత్రాన.. పార్టీ పరువు నిలబడుతుందా? అనేది! దువ్వాడ స్థాయిలో గానీ, అంతకంటె హేయమైన ఆరోపణలతో గానీ.. పార్టీ పరువు తీస్తున్న నాయకులు ఇంకెవ్వరూ లేరా? అనే ప్రశ్నలు పార్టీ కార్యకర్తల్లోనే వ్యక్తం అవుతున్నాయి.
ప్రత్యేకించి.. మరో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారాన్ని కూడా పార్టీ కార్యకర్తలే ప్రస్తావిస్తున్నారు. దళితుడైన తన డ్రైవరును చంపేసి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నాయకుడిగా అనంతబాబు రాష్ట్రానికంతటికీ తెలుసు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆంతరంగిక మిత్రుల్లో ఒకరని కొందరికి తెలుసు. ఆయన దళితుడిని హత్యచేసికూడా.. వైసీపీ పాలన కాలంలో.. విచ్చలవిడిగా వ్యవహరించిన వైనం పార్టీకి పెద్ద దెబ్బే కొట్టింది. ఇప్పుడు అనంతబాబు చేసిన హత్య కేసును పునర్విచారణ చేయాలని జిల్లా ఎస్పీ నిర్ణయించారు. మరో సీనియర్ అధికారికి ఈ కేసు ప్రత్యేక పునర్విచారణ చేసే బాధ్యత అప్పగించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే క్రమశిక్షణ కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. కమిటీ కొత్తగా ఏర్పాటు అయిన ఉత్సాహంలో ఏదో ఒక చర్య తీసుకుంటే తమ అస్తిత్వం వెలుగులోకి వస్తుందని వారు భావించారో ఏమో తెలియదు గానీ.. దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. ఆ ఒక్కవేటు సరిపోతుందా? అనంతబాబు లాంటి వాళ్లను ఉపేక్షిస్తే పార్టీకి పరువు దక్కుతూ ఉంటుందా? అనేది పలువురి ప్రశ్న.
అనంతబాబు అప్పట్లో తానే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ శిక్షలు మాత్రం పడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయిస్తున్న పునర్విచారణలో అనంతబాబుకు శిక్ష పడితే.. దానినికూడా రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులుగా బుకాయించి రోజులు నెట్టుకురావడం చాలా కష్టం. అనంతబాబు విషయంలో పోలీసులు చర్చ తీసుకున్నా కూడా జగన్.. దానిని వెనకేసుకు వస్తే పార్టీ కార్యకర్తలే ఛీత్కరించుకుంటారు. మరి అలాంటి వారి మీద కూడా అధినేత జగన్ రాగద్వేషాలు పక్కన పెట్టి చర్యలు తీసుకుంటేనే పార్టీని కాపాడుకోవడం సాధ్యమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.