బొత్స మాటలతో రోజా ఇరుక్కుంటుందా?

రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు సాగించిన అరాచకత్వానికి రాష్ట్రమంతా ముక్కున వేలేసుకుంది. జగన్ అధికారంలోంచి దిగిపోయే దాకా అసలు అక్కడ ఏం నిర్మించారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించే హోటల్లు, అతిథిభవనాలు కడుతున్నాం అని కోర్టుకు అబద్ధాలు చెబుతూ.. చివరికి ఎన్నికల నోటిఫికేషన్ కు కొన్ని వారాల ముందు రిబ్బను కత్తిరించి ప్రారంభించినప్పటికీ.. కనీసం ఒక్కరోజైనా అక్కడ బస చేయలేదు జగన్మోహన్ రెడ్డి. తన  నివాసం కోసం 481 కోట్లతో కట్టుకున్న భవనాలను ఏమాత్రం అనుభవించలేదు. ఇప్పటికీ రుషికొండ ప్యాలెస్ చర్చనీయాంశంగానే ఉంది.

తాజాగా అసెంబ్లీలో జరిగిన చర్చలో.. ఒక చదరపు అడుగుకు ఏకంగా 26 వేల రూపాయలు ఖర్చు పెడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడితనం ప్రదర్శించిందని మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు తదితరులు ఆరోపించారు. నిర్మాణంలో ఉండగా అప్పటి మునిసిపల్ మంత్రి బొత్స సత్యానారయణ అయినా ఆ భవనాలను ఒకసారైనా చూభారో లేదో అనంటూ మంత్రులు ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు వస్తే.. తాము తీసుకువెళ్లి వాటిని చూపిస్తాం అని కూడా అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే.. రుషికొండ నిర్మాణాల్లో ఏమాత్రం అవినీతి జరిగి ఉన్నా సరే.. చర్యలు తీసుకోవాలని.. అంటూ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు.

రుషికొండ ప్యాలెస్ నిర్మాణం అనేది ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగింది. జగన్ ప్రభుత్వం చివరిదశలో అంటే ముమ్మరంగా నిర్మాణ పనులు జరుగుతున్న సమయానికి రోజా టూరిజం మంత్రిగా ఉన్నారు. ప్రారంభోత్సవం కూడా ఆమె హయాంలోనే జరిగింది. నిజానిఃకి రుషికొండ ప్యాలెస్ అనేది జగన్ నివాసం కోసం కడుతున్న భవనం కావడం మూలాన.. దానికి సంబంధించిన కాంట్రాక్టు పనులు కేటాయించడంలో గానీ.. అనుమతించడంలో గానీ.. ఏ రకంగా కూడా మంత్రి రోజాకు భాగస్వామ్యం ఉండే అవకాశం లేదు.

ఆ కాంట్రాక్టర్లు టూరిజం మంత్రికి వాటాలు ఇచ్చి ఉంటారని అనుకోవడం కూడా భ్రమ. కానీ.. ప్యాలెస్ నిర్మాణంలో అవినీతి ఉన్నట్టు బయటపడితే మాత్రం సమాధానం చెప్పాలింది రోజానే. అందుకే కావాలంటే విచారణ చేసుకుని చర్యలు తీసుకోండి అంటూ బొత్స రెచ్చగొట్టే మాటల వలన తొలుత ఇరుక్కునేది రోజానే అని అంతా అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తన చేతికి మట్టి అంటకుండా రుషికొండ విధ్వంసాన్ని, తన నివాసం కోనం అతి దుర్మార్గమైన దందాను నడిపించారనే వాదనే సర్వత్రా వినిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories