తెలంగాణకు చెందిన చట్టసభల ప్రతినిధులకు కూడా తిరుమల దైవ దర్శనానికి సిఫారసు ఉత్తరాలు ఇచ్చే వెసులుబాటు గతంలో ఉండేది. కరోనా సమయంలో అందరివీ రద్దు చేశారు. ఆ తర్వాత తెలంగాణ నాయకులకు పునరుద్ధరించలేదు. జగన్ ప్రభుత్వ కాలంలో పలుమార్లు వారు అడిగారు కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఇందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం- ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈనెల 24 నుంచి తిరుమల దర్శనాలకు తెలంగాణ నేతల సిఫారసు ఉత్తరాలను అనుమతించనున్నారు. అందుకు తెలంగాణ నాయకులు చంద్రబాబు నాయుడు కి బహుధా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరుగుతోంది.
ఇప్పటి పరిణామాలను గమనిస్తోంటే.. తమ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు థాంక్స్ చెప్పడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే తిరుమల దర్శనానికి వెళ్లడం కోసం టీటీడీ వాళ్లని బతిమిలాడటం ఎందుకు? మనం యాదగిరి గుట్ట గుడికి వెళ్తే సరిపోతుంది కదా? అని రేవంత్ రెడ్డి తన నాయకులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అంటున్నారు! తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రాల పట్ల భక్తి పెంపొందేలా కొత్త చైతన్యం తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.
తిరుమల దైవదర్శనానికి వెళ్లడం పట్ల భక్తుల్లో ఉండే ఆధ్యాత్మిక చింతన కేవలం రేవంత్ రెడ్డి మాటలతో మారిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమల దర్శనానికి సిఫారసు ఉత్తరాలు ఇవ్వాల్సిందిగా వారి ప్రజల నుంచి సహజంగా ఒత్తిడి ఉంటుంది. మొత్తం తెలంగాణ సమాజాన్ని, తిరుమల గుడికి వెళ్లకుండా యాదగిరిగుట్టకు మాత్రమే వెళ్ళాలి అనే లాగా రేవంత్ రెడ్డి ప్రేరేపించలేరు. తమ మీద ప్రజల ఒత్తిడి ఉంటుంది గనుకనే సిఫారసు ఉత్తరాలకు చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వగానే అనేక మంది ప్రజాప్రతినిధులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనివలన రేవంత్ కు వచ్చిన నష్టమేమీ లేదు. నిజానికి ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు దేవుళ్ళ మధ్య తేడాలు చూపిస్తూ మాట్లాడారనే విమర్శతోపాటు చంద్రబాబు నాయుడుకు తన వారు థాంక్స్ చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే విమర్శ కూడా రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తోంది.