ఆయనపై కూడా లుకౌట్ నోటీసులు వస్తాయా?

రఘురామక్రిష్ణరాజుపై పోలీసు కస్టడీలో హత్యాయత్నం జరిగిన కేసు ఇప్పుడు రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అరెస్టు అయిన అప్పటి సీఐడీ ఎఎస్పీ విజయపాల్ విచారణలో అనేక విషయాలు వెల్లడించినట్టుగా వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ‘కర్మ ఎవరిదీ వదిలిపెట్టదు. నన్ను అరెస్టు చేసి చంపడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు అదే జైల్లో ఉన్నారు’ అంటున్న రఘురామక్రిష్ణరాజు ఈ కేసులో విజయపాల్ కు వెనుక ఉన్న ఇతర నిందితుల విషయంలో కూడా సత్వర చర్యలు ఉండాలని కోరుకుంటున్నారు.
అప్పట్లో సీఐడీ చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. సునీల్ కుమార్ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్నదని, అలా జరగకుండా, ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీచేయాలని, తదనుగుణమైన చర్యలు చేపట్టాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. ఆ సునీల్ కుమార్ తన ప్రెవేటు సిబ్బందితోనే తనమీద దాడి చేయించారని రఘురామక్రిష్ణ రాజు ఆరోపిస్తున్నారు.

వీరిద్దరితోపాటు, తన ఫిట్ నెస్ గురించి తప్పుడు రిపోర్టు ఇచ్చినందుకు  గుంటూరు జీజీహెచ్ అప్పటి సూపరింటెండెంటు మీద, వీరిందరినీ తన మీద హత్యాయత్నానికి పురిగొల్పినందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా రఘురామ కేసు పెట్టారు.

ప్రస్తుతం విజయపాల్ అరెస్టు అయిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో అనేక సంచలన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రఘురామక్రిష్ణరాజును ఉద్దేశపూర్వకంగా తీవ్రంగా హింసించినట్లుగా తేలినట్టు రిపోర్టులో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయపాల్ ను కోర్టులో హాజరుపరచిన తరువాత.. రిమాండుకు ఆదేశిస్తే.. పోలీసు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. కస్టోడియల్ విచారణలో మరిన్ని వివరాలు ఆయన ద్వారా వెలుగులోకి వస్తాయని సీఐడీ పోలీసులు అంటున్నారు. తెరవెనుక ఉండి వ్యవహారం మొత్తం నడిపించిన అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి పేర్లు కూడా వెల్లడవుతాయని అనుకుంటున్నారు. అదే జరిగితే.. వారందరినీ కూడా సీఐడీ పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురయ్యే వరకు విచారణకు సహకరించకుండా తెలియదు, గుర్తులేదు వంటి సమాధానాలు చెప్పిన విజయపాల్.. అరెస్టు తర్వాత.. ఎంత మేరకు మెత్తబడతారో.. ఏ వివరాలు వెల్లడిస్తారో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories