క్రమశిక్షణ లేని, నియంత్రణ లేని తన దూకుడు మాటలతో పార్టీకి తలనొప్పిగా మారుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పార్టీనుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం అవుతున్నదా? పార్టీ నాయకులతో ఉన్న విభేదాలను, అంతర్గతంగా పార్టీ నాయకులతో చర్చించకుండా.. మీడియా ముందు రెచ్చిపోయి.. పార్టీకి అల్టిమేటం జారీ చేయడం.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనానమా చేసేస్తానంటూ మిడిసిపడడం వంటి చర్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నది. అందుకే అసలు తిరువూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? అక్కడి నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఏమిటి? పరిష్కారం ఏమిటి? ఈ అన్ని అంశాలను పరిశీలించి.. నివేదిక ఇవ్వాల్సిందిగా.. పార్టీ అధినాయకత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది.
ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్త మంతెన సత్యనారాయణ రాజుల్ని కమిటీగా ఏర్పాటుచేసి తిరువూరులో ఏం జరుగుతోందో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పదినెలలనుంచి అసలు తిరువూరులో ఏం జరుగుతోందో స్టడీ చేసి చెప్పాలని పురమాయించారు. అక్కడి క్షేత్రస్థాయి రాజకీయాలు, విభేదాలు, కొలికపూడి పై వస్తున్న వివిధ ఆరోపణలు, ఆయన వ్యవహార సరళి వీటన్నింటి మీద అభిప్రాయాలు అడిగారు. ఆయన నియోజకవర్గంలో తరచూ వివాదాల్లో చిక్కకుంటూనే ఉన్నారు. అక్కడ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రమేశ్ రెడ్డితో విభేదాలున్నాయి. మహిళతో అసభ్య సంభాషణను నెపంగా చూపుతూ.. ఆయన మీద పార్టీ చర్యలు తీసుకోవాలని కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు. 48 గంటల్లోగా రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హుకుం జారీచేశారు. సదరు రమేశ్ రెడ్డికి ఎంపీ కేశినేని చిన్ని అండదండలు ఉన్నట్టుగా, ఆయనే అతడిని కాపడుతున్నట్టుగా అర్థం వచ్చేలా కూడా ఆరోపణలు చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు.. స్ట్రెయిట్ గా కేశినేని చిన్నిని ఇరికించడానికే ఈ ఆరోపణలుచేసినట్టుగా అందరూ భావిస్తున్నారు.
పార్టీ వ్యవహారాలు అంతర్గతంగా చర్చించుకోకుండా.. ఇలా బజార్నపడేలా మాట్లాడడంపై పార్టీ సీరియస్ గా ఉంది. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. కొలికపూడికి షోకాజు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్రమశిక్షణ తప్పి వ్యవహరించే నాయకులకు ఒక హెచ్చరిక లాగా ఆయన మీద చర్యలుండాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.