ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి విపరీతంగా అహంభావం ఉంటుందని, తాను మోనార్క్ ని అనే భావనలో ఆయన ఉంటారని.. దగ్గరినుంచి గమనించిన వారు చెబుతుంటారు. ఆయనలోని అలాంటి వైఖరి వల్లనే.. ఆ పార్టీలో చేరిన అనేక మంది సీనియర్లు మనుగడ సాగించలేక నెమ్మదిగా నెమ్మదిగా తమ దారి తాము చూసుకున్నారనేది వారి అభిప్రాయం. అలాంటిది.. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం తన కొడుకు తో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇవాళ చేరడం అనేది వాయిదా పడినప్పటికీ రేపో మాపో చేరే అవకాశం ఉంది.
ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న వారికి ఒక ప్రధానమైన సందేహం కలుగుతోంది. ముద్రగడ పద్మనాభం.. తాను జగన్ తో ఎలాంటి బేరాలు కుదుర్చుకోకుండానే పార్టీలో చేరుతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. జగన్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రాష్ట్రమంతా తిరిగి వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తానని కూడా ముద్రగడ అన్నారు.
అయితే ఇక్కడే చాలా మందికి సందేహం కలుగుతోంది. జగన్ ఆలోచన సరళి తెలిసిన వారు.. ముద్రగడ అనుకున్నట్లుగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయడం సాధ్యమవుతుందా అని సందేహిస్తున్నారు. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి తానొక్కడు మాత్రమే మోనార్క్ గా ఉండాలని అనుకుంటారు. తానొక్కడు మాత్రమే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలని, గెలుపు దక్కితే అది తన వల్ల మాత్రమే ఉండాలని.. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసేంతటి ప్రయారిటీ తనకు తప్ప మరొక నాయకుడికి ఉండనే కూడదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు.
ఆయన తన సభల్లో కూడా తన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేరని సెలవిస్తుంటారు. తాను తప్ప మరొక్కరు ఆ ప్రయారిటీతో ఉండకూడదని ఆయన భావన. దానిని తెలివిగా సమర్థించుకుంటూ.. రాష్ట్రంలోని ప్రజలందరూ వైసీసీ అభిమానులందరూ తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ఆయన చెబుతుంటారు. అలాంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం రాష్ట్రమంతా తిరిగి సభలు నిర్వహిస్తానని అంటే, ప్రచారం చేస్తానని అంటే జగన్ అనుమతిస్తారా? అనేది అనుమానం కలుగుతోంది.
ముద్రగడ పద్మనాభం తానేదో వైఎస్సార్ కాంగ్రెస్ ను ఉద్ధరించేస్తున్నానని అనుకుంటే అందుకు జగన్ అనుమతించడం ఉండదు. ముద్రగడను మించిన సీనియర్ నాయకులు ఎందరో, తాము జగన్ కు మార్గదర్శనం చేస్తాం అనే ఆలోచనలతో ఆ పార్టీలో అడుగుపెట్టి.. ఇవాళ పార్టీకి వెలుపల ఉన్నారు. ముద్రగడకు కూడా అలాంటి అనుభవం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ఈగోను, మోనార్క్ వైఖరిని టచ్ చేయనంత వరకు ముద్రగడ మనుగడకు ప్రమాదం లేదని, ఆ గీత దాటి ఆయన జగన్ కు మద్దతిస్తానని అనుకుంటే మాత్రం.. త్వరలోనే ఆ పార్టీనుంచి కూడా తట్టా బుట్టా సర్దుకోక తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.