వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి నెలలో సంక్రాంతి తర్వాత.. జిల్లాల్లో పర్యటించడానికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే జిల్లాల్లో పర్యటించేప్పుడు సన్నాహాలు ఎలాగ? ఏర్పాట్లను పర్యవేక్షించేది ఖర్చులు భరించేది ఎవరు? ఇలాంటి అంశాల గురించి ముందే ఏర్పాటు చేసుకోవడానికి, కీలక నాయకులకు పురమాయించి వారిపై భారం మోపడానికి జిల్లాలస్థాయి నాయకులతోు తాడేపల్లిలో ప్రస్తుతం సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యకర్లలతో జగన్ ఓ సమావేశం నిర్వహించారు.
అతి సహజమైన శైలిలో చంద్రబాబునాయుడు పరిపాలన మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని, విద్యుత్తు చార్జీలు పెంచిన తీరుపై పోరాటం సాగించాలని.. ఇలా రకరకాల స్టీరియోటైపు ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లాను బాగు చేసేలా తాను ఎన్నోపనులు చేసేశానని కూడా చెప్పుకున్నారు. కామెడీ ఏంటంటే.. ఇప్పటిదాకా పులివెందుల మెడికల్ కాలేజీలోనే హాస్టళ్లకు పూర్తిస్థాయి భవనాలకు, పూర్తిస్థాయి బోధన సిబ్బందికి గతిలేకపోగా.. మార్కాపురం మెడికల్ కాలేజీని కూడా తమ ప్రభుత్వం ఎన్నడో నిర్మాణం పూర్తిచేసేసిందంటూ.. జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ వారి ముందు గప్పాలు కొట్టుకున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉండాలని, అన్యాయం జరిగితే ప్రశ్నించాలని జగన్మోహన్ రెడ్డి సూచనలు చేయడం విశేషం. వైసీపీ సోషల్ మీడియా సైకోల పోస్టుల వ్యవహారాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో వైసీపీ వారి సోషల్ మీడియా తప్పుడు పోస్టుల మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ ఇచ్చే చిల్లర డబ్బులకు ఆశపడి తప్పుడు పోస్టులు పెడుతూ వచ్చిన వారు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. తమను క్షమించాలని, ఇంకెప్పుడూ తప్పుడు పోస్టులు పెట్టం అని కూటమి ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి వేడుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో పార్టీలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉండాలని జగన్ కొన్నాళ్లుగా పిలుపు ఇస్తుండడం గమనార్హం. వైసీపీ దళాలు కార్యకర్తల సోషల్ మీడియా ఖాతాలను పార్టీనే తీసుకుని, వారి ఖాతాల్లో పార్టీ తరఫునే సైకో పోస్టులు పెడుతూ వచ్చినట్టుగా.. అరెస్టు అయిన చాలా మంది పోలీసులకు విచారణలో చెప్పారు. సజ్జల భార్గవ్ ఇలాంటి దుర్మార్గాలు నడిపించినట్టు కూడా చెప్పారు. ఇప్పుడు పార్టీలోని ప్రతి కార్యకర్త కూడా కేసుల్లో ఇరుక్కోవాలనే కోరికతోనే జగన్ అందరినీ ఖాతాలు పెట్టుకోవాలని అంటున్నారా? అనే చర్చ పార్టీలో నడుస్తోంది. తాము సోషల్ మీడియా ఖాతాలు పెట్టుకుంటే.. ‘కంటెంట్’ పైనుంచి వస్తుందని.. అవి పోస్టు చేస్తే పోలీసు కేసులు, పోస్టు చేయకపోతే.. పార్టీ నుంచి వేధింపులు ఉండవచ్చునని వారు భయపడుతున్నారు.