మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? ఎలాంటి ప్రజాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి ప్రజా పోరాటాలను నడిపిస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా, భవిష్యత్తులో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వ్యక్తిగా ఆయన ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతున్నాడు? ఇవన్నీ ఎప్పటికీ ప్రజలకు అర్థం కాని సంగతులుగా మిగిలిపోతున్నాయి. పార్టీ ఓడిపోయిన తర్వాత.. ప్రతి వీకెండ్ బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ కు సతీసమేతంగా వెళ్లిపోయి అక్కడ విలాసంగా కొన్ని రోజులు గడిపి.. మళ్లీ తాడేపల్లికి రావడం మాత్రమే జగన్ చేస్తున్న పని. తాడేపల్లి క్యాంపులో ఉన్న రోజుల్లో ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఒకటో రెండో పార్టీ మీటింగులు పెట్టుకుని.. పార్టీ మీద ఏదో శ్రద్ధ ఉన్నట్టుగా బిల్డప్పులు ఇస్తుంటారు. అంతే తప్ప.. ఆయన ఇల్లుదాటి బాహ్యప్రపంచంలోకి, ప్రజల్లోకి అడుగుపెట్టే సందర్భాలే అతి తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మిర్చి రైతులకు ధరలు దక్కడంలేదనే ఒక్క సందర్భాన్ని మినహాయించి చూస్తే.. జగన్ ఇంట్లోంచి బయటకు వచ్చిన సందర్భాలు ఎన్ని? పార్టీ నేతల పెళ్లిళ్లు జరిగితే వెళ్లి దీవించడానికి, పార్టీ కీలక నాయకులు అరెస్టు అయినప్పుడు.. ఏది పడితే అది విచారణలో చెప్పవద్దని హెచ్చరించడానికి ములాఖత్ లకు, ఇంకా ఎవరైనా చచ్చినప్పుడు వారి కుటుంబాలను పరామర్శించడానికి మాత్రమే ఆయన ఇల్లు దాటి బయటకు వస్తున్నారు. ఇప్పుడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డి పల్లిలో జగన్ పర్యటించడానికి జగన్ సిద్ధమవుతున్న తీరు గమనిస్తోంటే.. ఈ సిద్ధాంతమే నిజం అనిపిస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కనిపించాలంటే.. ఎవరైనా జైలు పాలుకావాలి? ఎవరైనా చావాలి? ఈ రెండే మార్గాలు. జైళ్లలో పరామర్శలకు వెళ్లడం అనేది ప్రజల్లో పెద్ద సానుభూతి సృష్టించడం లేదు. కేసుల గురించి ప్రభుత్వం మీద ఎన్ని నిందలు వేసినా ప్రజలు పెద్ద ఖాతరు చేయడంలేదు. చావుల విషయంలో కొంత ప్రజలను కదిలించవచ్చునని జగన్ ఆశ. అందుకే పార్టీ వారు ఎక్కడ ఏ పరిస్థితుల్లో మరణించినా.. అందులోంచి ఎడ్వాంటేజీ పిండుకోవడానికి ఆయన తప్పకుండా వస్తున్నారు.
పాపిరెడ్డి పల్లిలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అనుచరుడు లింగమయ్య హత్యకు గురయ్యారు. దీనిని తెలుగుదేశానికి పులమడానికి, రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ చాలా ప్రయత్నిస్తున్నది. ఫ్యాక్షన్ భూతం మరియు ప్రబలిన పాత కక్షలు లింగమయ్యను బలితీసుకోగా.. అచ్చంగా దీనిని తెలుగుదేశం మీద నెట్టేయడానికి వైసీపీ తాపత్రయపడుతోంది. జగన్ స్వయంగా వెళ్లి టీడీపీ మీద మరింత నిందలు వేయడానికి తన వంతు కృషి చేయబోతున్నారు.
అంతా బాగానే ఉంది. లింగమయ్య హత్య జరిగి చాలా రోజులుకాగా, ఇంత లేటుగా జగన్ వెళుతున్నారు ఎందుకనే ప్రశ్న పలువురికి కలుగుతుంది. ఇప్పటికి కూడా కేవలం లింగమయ్య కోసం జగన్ ఈ టూరు ప్లాన్ చేసుకోలేదు. అక్కడ మొక్కుబడిగా ఓ గంట గడిపేసి అక్కడినుంచి బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లి విలాసంగా సేద తీరబోతున్నారు. లింగమయ్య కుటుంబ పరామర్శ అనేది బెంగుళూరు యాత్ర మధ్యలో ఓ చిన్న బ్రేక్ జర్నీ అన్నమాట. అదీ అసలు ట్విస్టు!