జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేశారు. రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి హింసను ప్రేరేపిస్తున్నదంటూ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా దేశంలోని అన్ని పార్టీల వారిని ఆహ్వానించారు. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల వారు రావడం కూడా జరిగింది. ఇప్పుడు జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆ వాదన నిజమేనా.. జగన్ కు అంత ధైర్యం ఉందా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి అక్రమార్జనలకు సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 నిందితుడు. ఆయన మీద కేసులు సుదీర్ఘ కాలంగా విచారణలో నానుతున్నాయి. తాజాగా జగన్ అవినీతి కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం నిర్ణయించడం కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో.. జగన్ గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలోని బలమైన మోడీ సర్కారుతో సన్నిహితంగా ఉండడానికే ప్రయత్నించారు. మోడీ ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా తాను ముందు నిలిచారు. రాజ్యసభలో వారికి బలం తక్కువ ఉండగా.. తన పార్టీ సభ్యులతో ఓట్లు వేయించారు. మోడీ ఎఫ్పుడు తారసపడినా కాళ్లు మొక్కారు. ఇలా అన్ని రకాలుగా సహకరిస్తూ తన కేసుల విషయంలో తనను తాను కాపాడుకుంటూ వచ్చారు.
ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీయే సర్కారు వచ్చినంత మాత్రాన.. కేంద్రంలో మోడీని వ్యతిరేకించి ఇండియా కూటమికి దగ్గరయ్యే ధైర్యం జగన్ కు ఉన్నదా అనేది పలువురి సందేహం. ఆయన ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తే అసలు కాంగ్రెస్ పొసగనిస్తుందా? అనేది ఒక అనుమానం కాగా.. అప్పుడిక మోడీ సర్కారు టార్గెట్ చేయకుండా ఉంటుందా? వచ్చే ఎన్నికల్లోగా జగన్ కేసుల్లో తీర్పులు వచ్చేసి.. శిక్షలు పడే పరిస్థితి వస్తుందా? అని కూడా పలువురు అంటున్నారు.
దీక్షలు చేయడం అఖిలేష్ వంటి నాయకుల మద్దతు తీసుకోవడం ఓకే గానీ.. జగన్ ధైర్యంచేసి ఇండియా కూటమిలోకి అడుగుపెట్టరని, కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి ఆయన ఈగో కూడా ఒప్పుకోదని పలువురు అంటున్నారు.