శాసనసభ సజావుగా జరిగే అవకాశం లేదు గనుక.. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం కూడా తమకు ఇవ్వరు గనుక.. అసెంబ్లీకి వెళ్లబోవడం లేదని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. శాసనసభ జరిగినన్నాళ్లూ తాము సభకు వెళ్లంగానే.. బయట కూర్చుని ప్రెస్ మీట్లు పెడుతూ.. సభలో జరిగే వ్యవహారాల మీద విమర్శలు చేస్తూ బతికేస్తామని కూడా ఆయన విశదీకరించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో సభ సజావుగా జరగదు అనే మాట ఆయన చిత్తశుద్ధితో చెప్పినదేనా? ఏదో ప్రభుత్వం మీద నింద వేయడానికి చెప్పినదా? అని నిరూపించుకోవడానికి ఆయనకు ఒక అవకాశం ఉంది. ఆ మాటలు ఆయన చిత్తశుద్ధితో చెప్పినవే అయితే.. వైఎస్సార్ సీపీ కి చెందిన ఎమ్మెల్సీలు శాసన మండలికి కూడా హాజరు కాకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడం ఒక్కటే తమ లక్ష్యమైతే.. సభకు దూరంగా ఉండడంలో నిజాయితీ ఉందని భావిస్తే కేవలం శాసనసభకు మాత్రమే కాకుండా, శాసనమండలికి కూడా దూరంగానే ఉండాలి. అలా కాకుండా, మండలికి మాత్రం తమ సభ్యులను హాజరయ్యేలా పంపి.. అక్కడ చర్చల్లో నానా రచ్చ చేయించి, బిల్లులకు అడ్డం పడే ప్రయత్నం చేస్తే దానిని వైసీపీ యొక్క కుటిలనీతిగా భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీకి శాసనసభలో కేవలం 11 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. మండలిలో అలా కాదు. వారికి అధికార కూటమి కంటె మెజారిటీ సభ్యుల బలం ఉంది. ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లుల మీద రాద్ధాంతం చేయడానికి ఆ బిల్లులు నెగ్గకుండా అడ్డుకోవడానికి కూడా సరిపడా బలం వారికి మండలిలో ఉంది. ఆ మండలికి బొత్స సత్యనారాయణ సారథ్యం వహిస్తున్నారు. జగన్ మాటల్లో నిజాయితీ ఉంటే మండలికి కూడా హాజరు కాకూడదు. అక్కడ మాత్రం హాజరై, శాసనసభకు మాత్రం డుమ్మా కొడితే.. అది కేవలం అవకాశవాదంగా భావించాల్సి ఉంటుంది.
అలాంటి ఆలోచన అవకాశవాదమూ, బలంలేని సభలో అడుగుపెట్టడానికి భయపడుతుండడమూ, జగన్మోహన్ రెడ్డిలోని పిరికితనానికి చిహ్నంగా భావించాల్సి ఉంటుంది. ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరో రెండు రోజుల్లో తేలుతుంది. సభాపర్వం మొదలయ్యే సమయానికి జగన్ ఆలోచన మారుతుందా? అని కూడా కొందరు అనుకుంటున్నారు. సభకు వెళ్లే ఉద్దేశం లేనప్పుడు ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేయాలని పలువురు విమర్శిస్తున్న నేపథ్యంలో జగన్ ఏం చేస్తారో చూడాలి.
ReplyForwardAdd reaction |