జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. ఒకవైపు ఆయన సంక్రాంతి తర్వాత జిల్లాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ పార్టీకి జోష్ తీసుకువస్తానని చెబుతున్నారు. మరొకవైపు అప్పటిదాకా తాను ఇంట్లోనుంచి బయటకు రాదలచుకోవడం లేదా? అనే అనుమానం కార్యకర్తలకు కలుగుతోంది. ఆయన పాలనలో సాగిన అక్రమాలకు దందాలకు సంబంధించి రోజుకో వాస్తవం వెలుగులోకి వస్తోంది. అవి నిజాలో అబద్ధాలో వివరణ చెప్పుకోవడానికైనా జగన్ ఇంట్లోంచి బయటకు రావాలి కదా.. అని ప్రజలు అనుకుంటున్నారు.
ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు వచ్చి తన గత ప్రభుత్వ పరిపాలనను ఓ గంటసేపు కీర్తించుకోవడం, తనమీద ఆరోపణలను క్లుప్తంగా కొట్టిపారేయడం.. మళ్లీ కలుగులోకి వెళ్లి మాయమైపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి తీరుగా సాగుతోంది. తాజాగా అదానీనుంచి ముడుపులు స్వీకరించి సెకితో ఒప్పందాలు కుదుర్చుకున్నారనే విషయంలో ఇంకా అనేక సాధికారికమైన ఆధారాలతో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక ప్రత్యేక కథనం అందించడం ఇప్పుడు సంచలనంగా ఉంది. ఇప్పుడు జగన్ మళ్లీ ఓసారి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది.
అదానీతో ముడుపులు తీసుకున్నట్టుగా జగన్ నిర్వాకం గురించి అమెరికా మొదలుగా ప్రపంచం మొత్తం కోడై కూస్తూ ఉంటే.. జగన్ ఎంచక్కా ఒక ప్రెస్ మీట్ పెట్టి దులిపేసుకున్నారు. ఒప్పందం తాము కేంద్రప్రభుత్వ సంస్థ సెకితో చేసుకుంటే అదానీ ముడుపులు ఎందుకిస్తారని ఆయన ఎదురు ప్రశ్నించి తేల్చేశారు. అయితే సెకితో ఒప్పందం చేసుకోవడమే పెద్ద ఫ్రాడ్ అని ఇప్పటికే రకరకాల రూపాల్లో వెలుగులోకి వచ్చింది. అయితే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖలు చాలా స్పష్టంగా ఈ ఒప్పందం వద్దు అని, దీనివల్ల చాలా భారం పడుతుందని, బేరమాడి ఇంకా చవగ్గా కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నదని రకరకాలుగా చెప్పినప్పటికీ జగన్ చెవిన వేసుకోలేదని, స్వీయ నిర్ణయాలతో దూకుడుగా ఒప్పందాలు చేసుకున్నారని ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ వివరాలన్నఅ విపులంగా అందించడం గమనార్హం.
ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తే.. విద్యుత్తు సరఫరా పూర్తిస్థాయిలో మొదలయ్యేనాటికి ప్రభుత్వం ప్రతి ఏటా .. సామాజిక భద్రత, పోషాకాహార కార్యక్రమాలకు కలిపి ఎంత డబ్బు వెచ్చిస్తుందో అంత సొమ్ము వారికి ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించినప్పటికీ జగన్ పట్టించుకోలేదు. బేరమాడితే ధరలు తగ్గుతాయని ఆర్థిక శాఖ సిపారసు చేసినప్పటికీ బేఖాతరు చేశారు. రాయిటర్స్ సంస్థ జగన్ ప్రభుత్వానికి చెందిన 19 డాక్యుమెంట్లను సమీక్షించి, డజనుముందికి పైగా కేంద్ర రాష్ట్ర అధికారులను ఇంటర్వ్యూ చేసి చివరికి అందరి సలహాలు పక్కన పెట్టి డీల్ చేసుకున్నట్టు తేల్చింది. సెకి సంప్రదించిన మరురోజే ఒప్పందంపై సంతకాలు జరగడం.. ఆఘమేఘాల పనులు నడిపించడం కూడా జగన్ దందాలో భాగమేనని రాయిటర్స్ తేల్చింది.
అంతర్జాతీయ వార్తాసంస్థ పరిశోధనలో తన దందా ఇంతగా బయటపడిన తర్వాత.. మళ్లీ తనను తాను సమర్థించుకోవడానికి జగన్ ఇంకో ప్రెస్ మీట్ పెడతారా? లేదా ఎప్పటికీ కలుగులోనే ఉండిపోతారా? అనేది తెలియడం లేదు.