వైఎస్ జగన్మోహన్ రెడ్డిలోని విధ్వంసక మనస్తత్వం రోజురోజుకూ జడలువిప్పి నాట్యం చేస్తున్నదా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. రాష్ట్రం బాగు కోసం కూటమి ప్రభుత్వం ఏం చేయదలచుకున్నా సరే.. ఆ పనులను అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు చేస్తున్న వికటప్రయత్నాలు అన్నీ యిన్నీ కావు. ఒక్కో విషయంలో ఒక్కో రకంగా తమ దుర్బుద్ధులను ప్రదర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుకాడడం లేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కలిసి వారిని ఆహ్వానిస్తూ ఉండగా.. ఆ సంస్థలు రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు దాదాపుగా 200 ఈమెయిల్స్ నకిలీ పేర్లతో పంపి.. కంపెనీలను బెదిరించిన సంగతి ఇటీవలే చర్చకు వచ్చింది. అంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాదలచుకున్నప్పుడు.. ఆకాశరామన్న ఈమెయిల్స్ తో అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నమాట. ఇప్పుడు.. చంద్రబాబునాయుడు రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి, గోదావరి వృథాజలాలను, ఆయకట్టు చివరిరాష్ట్రంగా ఏపీ వాడుకోగల హక్కుతో పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును తలపెడితే.. దానిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి డైరక్టుగానే రంగంలోకి దిగుతున్నారు. బనకచర్లకు మోకాలడ్డడానికి బినామీ పేర్ల వ్యవహారం కూడా కాదు.. జగన్ స్వయంగా రంగంలోకి దిగి విషం కక్కుతున్నారు. ఈ ప్రయత్నాలతో వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహిగా ముద్రపడే అవకాశం ఉన్నదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుపై విషం కక్కారు. ఒకవైపు ఈ ప్రాజెక్టుకు తీవ్రఅభ్యంతరాలు తెలుపుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి, నిధులు-అనుమతులు ఇవ్వాల్సి ఉన్న కేంద్రాన్ని కూడా ఒప్పించి.. ఆయకట్టు చివరి రాష్ట్రం గనుక.. వృథాజలాలను వాడుకోవడానికి ఉన్న హక్కును వారికి వివరించి.. బనకచర్లను సాధించాలని చంద్రబాబునాయుడు ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొంటూ ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలోనే.. ఇక్కడ రాష్ట్రంలో జగన్ ఇలా విషం కక్కడం గమనార్హం.
బనకచర్ల ఈ రాష్ట్రానికి అవసరం లేదని, గోదావరి మిగులు జలాల గురించి స్పష్టమైన లెక్కలు తేలకుండా.. 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు నిర్మించడంలో అర్థం లేదని జగన్ వ్యాఖ్యానించారు. నిజానికి మూడువేల టీఎంసీలు ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్నట్టుగా.. చంద్రబాబు సర్కారు వందేళ్ల వెనక్కు వెళ్లి గణాంకవివరాలను కేంద్రానికి సమర్పించి మరీ అనుమతులు అడిగింది. అయితే.. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి కూటమిప్రభుత్వం సంకల్పించిన ఈ ప్రాజెక్టు వద్దని అనడం ద్వారా.. జగన్ రాయలసీమ ద్రోహిగా ముద్రపడనున్నారని విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లా మల్కాల పంపింగ్ స్టేషను వద్ద హంద్రీనీవా కాల్వకు చంద్రబాబు నీటిని విడుదల చేసిన సందర్భంగా.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఇదే సంగతి వెల్లడించారు. రాయలసీమ జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబునాయుడు చూస్తోంటే.. జగన్ మాత్రం ఇక్కడ అరాచకం సృష్టించాలని అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.