తగ్గి మాట్లాడడం జగన్ కు చేతనవుతుందా?

విశాఖలో స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలోకి మారిపోకుండా కాపాడుకోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిపెద్ద బాధ్యత. ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ స్థానం వారి ఖాతాలో ఉండేది. వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరడం వలన ఉప ఎన్నిక ఏర్పడింది. మళ్లీ తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకోగలిగితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరువు నిలబడుతుంది.

అయితే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బుజ్జగించడం, అనునయించడం వారికి భవిష్యత్తు పట్ల భరోసా కల్పించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంత సుహృద్భావ వాతావరణంలో మాట్లాడగలరు అనేదాన్ని బట్టి పర్యవసానాలు ఉండబోతున్నాయి. జగన్ కాస్త తగ్గి మాట్లాడగలరా? అనేది అనుమానం. సాధారణంగా ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు ఇవ్వని జగన్.. కార్పొరేటర్లతో ఎలా బిహేవ్ చేస్తారనేది ప్రశ్నగా ఉంది.  విశాఖలో వైసీపీలో మిగిలిన కార్పొరేటర్లు జగన్ తో  భేటీకి తాడేపల్లికి రానున్న తరుణంలో ఈ అంశం కీలకంగా మారుతుంది.

విశాఖపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 58 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పరిణామాలలో 12 మంది కార్పొరేటర్లు కూటమి పార్టీలలో చేరారు. ఇంకా 12 మందికి పైగా పార్టీ మారనున్నట్లుగా పుకార్లు అప్పట్లో వినిపించాయి. అయితే కార్పొరేటర్లను కాపాడుకోవడానికి గుడివాడ అమర్నాథ్ ఒకవైపు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా నోటిఫికేషన్ విలువడటంతో వారిని బుజ్జగించడానికి పార్టీ విడిపోయే ఆలోచనను దూరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
విశాఖ నుంచి 45 మంది కార్పొరేటర్లు రెండు బస్సులలో బయలుదేరి తాడేపల్లి జగన్ ప్యాలెస్ కు ఆయనతో భేటీ కావడానికి వస్తున్నారు. అయితే ఈ 45 మంది కూడా స్థిరంగా పార్టీలో కొనసాగే వారేనా లేక వారిలో కొందరికి ఫిరాయిస్తారా అనే అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. ఈ విషయం జగన్ మోహన్ రెడ్డి వారితో ఎలా మాట్లాడుతారు అనేదానిపై ఆధారపడి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. జగన్ ఇటీవలి కాలంలో ఘోరమైన పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో పార్టీ నేతలతో కాస్త ఆవేశంగా ‘పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి’ అనే తరహాలో ఆయన మాటలు ఉంటున్నాయి. ఇది పలువురిని నొప్పిస్తోంది.

‘జగన్ ఇలాగే వ్యవహరిస్తే పార్టీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళు కూడా మిగలరు’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నాయకులే ఓటమికి బాధ్యులని ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకున్నారని ఇలా రకరకాలుగా తాను ఎవరితో అయితే సమావేశమవుతున్నాడో వారిని నిందించడం ఇటీవల కాలంలో జగన్ వైఖరిగా మారింది. అదే మాదిరిగా కార్పొరేటర్లతో కూడా వ్యవహరిస్తే నష్టం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారిని బుజ్జగించేలాగా బతిమాలి అయినా ఒప్పించే లాగా పార్టీ పట్ల నమ్మకం భవిష్యత్తు పట్ల భరోసా కల్పించే లాగా చేస్తే తప్ప కార్పొరేటర్లను కాపాడుకోవడం కష్టమనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్లతో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలోని స్థానిక సంస్థల ప్రజల ప్రతినిధులను కూడా జగన్ బుజ్జగించాల్సి ఉంటుంది. కానీ ఆయన అహంకారం వీడి మెత్తగా మాట్లాడడం నేర్చుకోగలరా అనేది పార్టీ వారికే అనుమానం గా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories