పునర్విచారణ మొదలైతే అవినాష్, జగన్ లకు గడ్డు రోజులే?

కడపజిల్లా హత్యారాజకీయాల చరిత్రలో ఇది కొత్త అప్ డేట్! ఆరేళ్ల కిందట జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు పునర్విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును సీబీఐ పునఃప్రారంభించాలని, ఆ మేరకు వారిపై ఒత్తిడి తేవాలని ఇప్పుడు నరెడ్డి సునీత డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యవెనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించిన విచారణ కూడా జరగాల్సి ఉన్నదని ఆమె భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్పష్టంగానే పేర్కొంటున్నారు. ఈ మేరకు దేశంలోని మొత్తం అందరు ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆమె ఒక బహిరంగ లేఖ రాశారు. సునీత కోరికకు మన్నన దక్కితే గనుక.. కేసు దర్యాప్తు మళ్లీ జరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే… ప్రస్తుతం బెయిలుమీద ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి మాత్రమే కాదు, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కూడా గడ్డురోజులు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు.

అవినాష్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని కోరుతూ నరెడ్డి సునీత సుప్రీంకోర్టులో దావా నడుపుతున్నారు. సుప్రీంలో సీబీఐ ఈ కేసు దర్యాప్తు పూర్తయిందని, సుప్రీం ఆదేశిస్తే దర్యాప్తును కొనసాగిస్తామని పేర్కొన్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతానికి 19వ తేదీకి వాయిదా వేసిఉన్నారు. ఈలోగానే నరెడ్డి సునీత తన కొత్త డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. ఆమె చాలా సహేతుకమైన పాయింట్ నే లేవనెత్తుతున్నారు.
వివేకానందరెడ్డి హత్య సంగతి బాహ్యప్రపంచానికి తెలియడానికంటె చాలా సమయం ముందే జగన్ కు తెలుసునని ఆమె చెబుతున్నారు. హత్యలో కీలక నిందితుడు అయిన అవినాష్ రెడ్డి అప్పటికే పలుమార్లు వైఎస్ జగన్ తో ఫోనులో మాట్లాడినట్టుగా కాల్ డేటా ఆధారాలు సీబీఐ పోలీసులు సేకరించిన సంగతిని గుర్తుచేస్తున్నారు. ఈ విషయాలన్నీ గతంలో తెలంగాణ హైకోర్టులో సీబీఐ వెల్లడించినప్పటికీ కూడా.. ఆ కోణంలో విచారించకుండా నిలిపివేసిందని ఆమె ఆరోపిస్తున్నారు.

ఈ హత్య వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరో తేల్చకుండానే.. దర్యాప్తు ముగిసినట్టుగా ప్రకటించడం దారుణం అని సునీత వాపోతున్నారు. అందుకోసమే కేసు పునర్విచారణకు డిమాండ్ చేయాలని కోరుతూ ఆమె అందరు ఎంపీలు, ఏపీలోని ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖ రాశారు. రాఖీపౌర్ణమి సందర్భంగా ఒక సోదరిగా మీ సహకారం కోరుతున్నానని ఆమె పేర్కొనడం గమనార్హం.

వివేకాను హత్యచేయడంలో స్వయంగా పాల్గొన్నవారిని పట్టుకున్నారే తప్ప.. ఈ హత్య వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరో పోలీసులు తేల్చడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిట్ దర్యాప్తును కీలక దశకు తీసుకువచ్చిన సమయంలో దానిని జగన్ మార్చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో నరెడ్డి సునీతకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories