ఏపీలో పాలక- ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ ఉన్నాయి. ఒక్క సీటు చేజారినా కూడా.. మొత్తం అధికారాన్ని అందించే ఫలితమే తారుమారు అవుతుందన్న భయంతో ఆచితూచి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నాయి. రెండు పార్టీలకూ రెండు రకాల గండాలు పొంచి ఉండగా.. వాటిని అధిగమించడానికి చేతనైనంత స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇన్నీ సమీకరణాలు నడుస్తుండగా.. ఏలూరు జిల్లా చింతలపూడి లోని వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఆయన అదే చింతలపూడి బరిలో ఈ ఎన్నికల్లో తలపడబోతున్నారు. ఈ నేపథ్యంలో.. చింతలపూడిలో విజయం తెలుగుదేశానికి కేక్ వాక్ అవుతుందా అని పలువురు అంచనా వేస్తున్నారు.
ఎలీజా తనకు టికెట్ మళ్లీ కేటాయించాలని జగన్ ను తొలినుంచి అభ్యర్థిస్తూ వచ్చారు. అయితే.. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎడాపెడా మార్చేస్తూ.. బదిలీల రాజకీయానికి తెరతీసిన జగన్.. ఈసారి చింతలపూడి అభ్యర్థిగా కంభం విజయరామరాజును ప్రకటించారు. దీంతో ఎలీజ్ హర్ట్ అయినప్పటికీ ఇన్నాళ్లూ మౌనంగానే ఉన్నారు. పార్టీ మళ్లీ గెలిస్తే తనకు ఏమైనా మంచి అవకాశాలు ఉంటాయని, అలాంటి హామీ పార్టీ అధినేతల నుంచి వస్తుందని ఆయన ఎదురుచూస్తూ ఉన్నారేమో తెలియదు. మొత్తానికి నిరీక్షించారు. కానీ జగన్ పట్టించుకోలేదు.
మరోవైపు పిఠాపురంలో టికెట్ తిరస్కరింపబడిన సిటింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును మాత్రం జగన్ స్వయంగా పిలిపించి.. పవన్ కల్యాణ్ ను ఓడించడానికి సహకరించాలని.. పార్టీ గెలిచాక తొలివిడతలోనే ఎమ్మెల్సీ ఇస్తానని భరోసా ఇచ్చి బుజ్జగించారు. అంతే తప్ప చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, గూడూరు ఎమ్మ్లెల్యే వరప్రసాద్ లాంటివారిని పట్టించుకోలేదు.
ఆదివారం నాడు వరప్రసాద్ బిజెపిలో చేరి తిరుపతి ఎంపీ టికెట్ దక్కించుకోగా.. ఎలీజా హైదరాబాదులో కాంగ్రెసులో చేరి ఆ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఎలీజా సిటింగ్ ఎమ్మెల్యే కావడం మూలాన ఆయన ప్రభావితం చేయగలిగిన ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఉంటుందని, ఆ మేరకు కాంగ్రెసుకు పడే ప్రతి ఓటూ వైసీపీకే నష్టం అని పలువురు అంచనా వేస్తున్నారు. అందుకే.. తెలుగుదేశం అభ్యర్థి సొంగ రోషన్ సునాయాసంగా గెలుస్తారని కూడా అంటున్నారు.