జగన్ కోరికకు చెల్లెమ్మ మోకాలడ్డకుండా ఉంటుందా?

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిలో చేర్చడానికి ఉత్సాహపడుతున్నారనే వార్తలు ఆయన ఓడిపోయినప్పటినుంచి ముమ్మరంగా వినిపిస్తున్నాయి. తనపై విచారణలో ఉన్న అవినీతి కేసులనుంచి రక్షణ ఉండాలంటే.. బలమైన జాతీయ పార్టీ మద్దతు ఎంతో అవసరం అనే భావనతో ఉన్న జగన్ కు ఇప్పుడు  ఇండియా కూటమిలోచేరడం అనేది అనివార్యంగా కనిపిస్తుండవచ్చు. ఎన్డీయే కూటమి ప్రభుత్వమే ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తోంది. ఇన్నాళ్లు జగన్ అధికారంలో ఉండగా.. మోడీ కనిపిస్తే కాళ్లు మొక్కుతూ సత్సంబంధాలు కొనసాగించారు. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, గతంలో జగన్ వైఫల్యాలను చీల్చి చెండాడేస్తోంది. జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో చేరడానికి మొగ్గుతున్నారని, అందుకే బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ లో కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేతలకు విందు కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రాపకంలో ఉంటూ తనను తాను కాపాడుకోవడానికి జగన్ మొగ్గవచ్చు గానీ.. ఏపీలో ఆ పార్టీకి సారథ్యం వహిస్తున్న చెల్లెమ్మ వైఎస్ షర్మిల మోకాలడ్డకుండా ఉంటుందా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో సాగుతున్న చర్చ.

జగన్మోహన్ రెడ్డి.. ఇండియా కూటమిలో చేరడానికే కర్నాటకలోని కాంగ్రెసు నాయకులకు శనివారం తన ప్యాలెస్ లో విందు ఇచ్చారని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య చెబుతున్నారు. నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. జాతీయ రాజకీయాల విషయానికి వచ్చేసరికి కాంగ్రెసుతో జట్టుకట్టడం తప్ప జగన్ కు వేరే గతి లేదు. కర్నాటకలోని కీలక నాయకులతో ఆయనకు పాతరోజుల నుంచి ఉన్న సన్నిహిత సంబంధాలు ఇందుకోసం కొంత ఉఏపయోగపడవచ్చు కూడా. కానీ, ఏపీసీసీ సారథి షర్మిలతో ఉన్న వ్యక్తిగత వైరం చాలా తీవ్రమైనది. అందువల్ల జగన్ కోరిక తీరుతుందా? లేదా? అనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి.

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. తన గెలుపుకోసం అహరహం పరిశ్రమించిన చెల్లెమ్మ షర్మిలను పూర్తిగా దూరం పెట్టడం ద్వారా జగన్ తన సంకుచిత బుద్ధిని చూపించుకున్నారు. ఆమె రాజకీయ జీవితం రకరకాల మలుపులు తిరిగి.. 2024 ఎన్నికల సమయానికి ఏపీసీసీ సారథి అయింది. జగన్ మీద తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడుతూ వచ్చింది. చంద్రబాబు, పవన్ ల కంటె తీవ్రంగా జగన్ ను విమర్శించింది. మొత్తానికి ఆయన పార్టీ పతనమైంది. ఇప్పుడు అంతో ఇంతో బతికి బట్టకట్టాలంటే కాంగ్రెస్ జట్టులో ఉండాలని జగన్ అనుకోవచ్చు. కానీ.. షర్మిల అనుమతించకుండా అది సాధ్యం కాదని, ఆమె అనుమతించడం కూడా అంత ఈజీ కాదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories