కేంద్రంలో ఎన్డీయే కూటమి చాలా బలంగా ఉంది. ప్రధానంగా ప్రభుత్వం స్థిరత్వం అనేది చంద్రబాబునాయుడు మీద ఆధారపడి ఉంది. చంద్రబాబునాయుడు కూడా భారతీయ జనతా పార్టీతో తన స్నేహబంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని బహుధా వాడుకునే ఉద్దేశంతోనే ఉన్నారు. తెదేపాకు చెందిన ఇద్దరు కేంద్ర కేబినెట్లో కూడా ఉన్నారు. ఇంత ఐక్యంగా వారు కనిపిస్తున్నప్పటికీ.. ఆ కూటమిలో ముసలం పుట్టించడానికి ఇం.డి.యా. కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం లోక్ సభలో స్పీకరుగా ఎవరు ఉండబోతున్నారు? అనే అంశంపై చర్చ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ సహజంగానే తమ చేతిలో స్పీకరు పదవి ఉండాలని అనుకుంటోంది. తమ కూటమిలోని కీలక పక్షాలు తెలుగుదేశం, జేడీయూలలో డిప్యూటీ స్పీకరు పదవి ఇవ్వాలని భావిస్తోంది. అయితే డిప్యూటీ స్పీకరు పదవిని ఇం.డి.యా. కూటమికి ఇవ్వకపోతే గనుక.. స్పీకరు పదవికి పోటీపెట్టాలని వారు భావిస్తున్నారు. పోటీ పెట్టి సాధించేదేమీలేదు. అయినా ఆ ఆలోచన చేస్తున్నారు.
పనిలో పనిగా కూటమిలో ముసలం పుట్టించడానికి చూస్తున్నారు. తెలుగుదేశం స్పీకరు పదవికోసం తమ అభ్యర్థిని పోటికి దింపితే గనుక.. ఇం.డి.యా. కూటమి మద్దతు ఇస్తుందని శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన సంజయ్ రౌత్ అంటున్నారు. నిజానికి రౌత్ మాటలకు ఇం.డి.యా. కూటమి ఎంత విలువ ఇస్తుందో కూడా తెలియదు. కాకపోతే స్పీకరు పదవిని భాజపా దక్కించుకుంటే తెదేపా, జేడీయూలను చీల్చడానికి ప్రయత్నిస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
అయినా కేంద్రంతో ఎంతో సత్సంబంధాలను కోరుకుంటున్న చంద్రబాబునాయుడు ఎలాంటి తాయిలం ఎదురైనా సరే.. అసలు వారితో సున్నం పెట్టుకుంటారు. స్పీకరు పదవి కోసం ఆ బంధాన్ని వదులుకుంటారా? అనే సింపుల్ లాజిక్ కూడా ఈ సీనియర్ నేతకు అందడం లేదు.
ఇదంతా చూడబోతే.. డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షాలకు ఇవ్వకుండా పోతారేమో అనే భయంలో, కంగారులో చేస్తున్న కామెంట్స్ లాగా కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇండియా విసిరే బిస్కట్లకు చంద్రబాబునాయుడు పడరని వ్యాఖ్యానిస్తున్నారు.