బొత్స ఆత్మవంచన పార్టీని మళ్లీ ముంచుతుందా?

రాజకీయాలు అన్న తరువాత గెలుపోటములు సహజం. అధికారం చేతులు మారుతూ ఉండడం సహజం. ప్రజల తీర్పు అప్పుడప్పుడూ ప్రతికూలంగా మారుతూ ఉండడం కూడా సహజం. ఓడిపోయిన సందర్భాల్లో.. ఎందుకు ఓడిపోయామో వాస్తవ కారణాల్ని విశ్లేషించుకుని, ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో పరిశీలించి తెలుసుకోగలిగిన వారికి మళ్లీ గెలిచే అవకాశం వస్తుంది. అలా చేయకుండా ఓడిపోయినప్పుడు ఆత్మవంచన చేసుకుంటూ, తమ లోపాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, ప్రత్యర్థి తప్పుడు పద్ధతుల్లో గెలిచారని ఆరోపించుకుంటూ రోజులు వెళ్లదీస్తే … అలాంటి పార్టీకి ఎప్పటికీ మనుగడ ఉండదు. ఇప్పుడు వైసీపీ జమానాలోని కీలక నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాటలను గమనిస్తే మనకు ఈ సంగతే బోధపడుతుంది.
ఏడాది గడిచిన తరువాత కూడా.. బొత్స సత్యనారాయణ ఎన్నికల్లో పరాజయానికి సంబంధించి వాస్తవాల్ని ఒప్పుకోవడం లేదు.  ఆయన మాటలు ఆత్మవంచనకు పరాకాష్టగా ఉంటున్నాయి. ఈవీఎంల వల్లనో, ఇంకే కారణం వల్లనో అధికారం కోల్పోయాం అని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన నాటినుంచి వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా ఇదే పాట పాడారు. ఆ పార్టీకి చెందిన కొందరు ఈవీఎంల పరిశీలను కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుని భంగపడ్డారు కూడా. ఓడిపోయినప్పుడు ఈవీఎం ల మీద నెట్టేసి.. చంద్రబాబు మాయచేసి గెలిచాడని అనడం జగన్ అండ్ కో కు అలవాటుగా మారినట్టు కనిపిస్తోంది. అధికార అహంకారంతో కళ్లుమూసుకుపోయిన జగన్మోహన్ రెడ్డికి.. ఫలితాలు కలిగించిన షాక్ లో అలా మాట్లాడారని జనం అనుకున్నారు. కానీ ఏడాది తర్వాత కూడా బొత్స అదే మాటలు చెబుతుండడం చూస్తే.. ఆ పార్టీ ఇక ఎప్పటికీ బాగుపడదేమో అని.. ఇలాంటి ఆత్మవంచన ఆ పార్టీని ముంచుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

పైపెచ్చు బొత్స ఇంకో మాటకూడా అంటున్నారు. ‘మేం సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పాం. చేయలేక క్షమాపణ కోరాం. చంద్రబాబు, పవన్ కల్యాణ్,  భాజపా నాయకులు సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు చేయలేదు’ అని ప్రశ్నిస్తున్నారు. కూటమి పార్టీల నాయకులు ఎవ్వరూ కూడా ఏ సందర్భంలోనూ సీపీఎస్ రద్దు గురించి మాట్లాడలేదు. జగన్ అతిచేసి అలాంటి హామీ ఇచ్చి ఉద్యోగుల ఎదుట భంగపడ్డారు. కానీ.. కూటమి పార్టీలు ఎన్నడూ ప్రకటించని హామీని కూడా వారికి ఆపాదించి.. ఆ మేరకు కూటమి ప్రభుత్వం పట్ల సీపీఎస్ ఉద్యోగుల్లో ద్వేషం కలిగించడానికి బొత్స ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories