యాదగిరి గుట్ట బోర్డులో ఏపీకి కోటా ఉంటుందా?

వేంకటేశ్వరుడు కొలువు తీరిన తిరుమల క్షేత్రం అందరికీ ఆదర్శం అనడంలో సందేహం లేదు. తెలంగాణలో కూడా తిరుమల వంటి ఆలయం ఉండాలనే ఉద్దేశంతో.. తొమ్మిదేళ్లు పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. యాదగిరి గుట్ట ఆలయాన్ని చాలా భారీ స్థాయిలో నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ.. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదనే సంగతి ఆయన గ్రహించడానికి చాలా కాలం పట్టింది. తిరుమల ఆలయం తరహాలో టికెట్ ధరలు గట్రా భారీగా పెట్టారు గానీ.. నిర్వహణ పారదర్శకంగా నిజాయితీగా జరిగేలా చూడడంలో కేసీఆర్ సర్కారు విఫలం అయింది.

ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా.. యాదగిరి గుట్ట ఆలయ నిర్వహణలో తిరుమల ఆదర్శంగా కొన్ని పనులు చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు తరహాలో యాదగిరి గుట్టకు కూడా పాలకమండలి ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. తిరుమలలో స్వామివారి మూలవిరాట్టు ఉండే గర్భగుడి శిఖరానికి బంగారు తాపడం ఉండగా.. యాదగిరి గుట్టలో ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగంగా పూర్తిచేయాలని రేవంత్ రెడ్డి ఆదేశిస్తున్నారు.

అయితే గుట్టకు కూడా పాలకమండలి ఏర్పాటవుతుందని వార్తలు వస్తున్నవేళ ప్రజల్లో ఒక సందేహం కలుగుతోంది. టీటీడీ బోర్డులో కొన్ని ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కోటా ఇచ్చినట్టుగా ఆయా రాష్ట్రాలకు చెందిన వారిని తప్పనిసరిగా సభ్యులుగా నియమిస్తుంటారు. గుట్ట పాలకమండలిలో కూడా ఆ విధంగా ఏపీ కి చెందిన వారిని సభ్యులుగా నియమిస్తారా? అలాగే.. తిరుమల దర్శనాలకు తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు ఉత్తరాల్ని కూడా పరిగణించాలని కోరుతున్నట్టుగా.. యాదగిరి గుట్టలో, భద్రాచలంలో ఏపీ ఎమ్మెల్యేల సిఫారసు ఉత్తరాలకు కూడా పనులు జరిగేలా ఏర్పాటుచేస్తారా? అనేది ఇప్పుడు ప్రజల సందేహం.

టీటీడీ బోర్డులో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారిని కూడా సభ్యులుగా నియమిస్తుంటారు. తద్వారా జాతీయ స్థాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతూ ఉంటుంది. యాదగిరి గుట్ట పాలకమండలి విషయంలో కూడా రేవంత్ అలాంటి ప్రమాణాలు అనుసరించడం బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories