జగన్ తో సుదీర్ఘకాల స్నేహబంధానికి కటీఫ్ కొట్టేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసేసిన తర్వాత.. విజయసాయిరెడ్డి తాను రాజకీయ సన్యాసం తీసుకున్నట్టుగా ప్రకటించారు. ఇకపై తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయం చేసుకుంటానని, రాజకీయాల జోలికి రానని ఆయన తేల్చి చెప్పారు. ఏ పార్టీలో చేరబోయేది కూడా లేదని తొలుత ఢిల్లీలో ప్రకటించారు. అయితే.. ప్రస్తుతం విజయసాయిరెడ్డి భాజపాలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా.. ఆ పార్టీ ఢిల్లీ పెద్దలతో ఉన్న సత్సంబంధాలను వాడుకుని, రాష్ట్రంలో కీలక స్థానంలో పార్టీ బాధ్యతలు చూడబోతున్నట్టుగా కొన్ని పుకార్లు వస్తున్నాయి.
అదే సమయంలో.. ఈ పుకార్లపై రాష్ట్ర కమలదళంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ జమానాలో అనేక అవినీతి దందాలకు రూపకర్తగా ముద్రపడిన విజయసాయిరెడ్డిని చేర్చుకుంటే.. కమలదళానికి పరువుంటుందా? అనే చర్చ పార్టీలో నడుస్తోంది.
విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతారనే వదంతి పుట్టడానికి కూడా ఆయన మాటలే కారణం. ఇటీవల కాకినాడ పోర్టు వాటాల బలవంతపు బదలాయింపు కేసులో సీఐడీ విచారణ ఎదుర్కొనేందుకు హాజరైనప్పుడు ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
అయితే స్థానిక పరిస్థితులను గమనిస్తే.. విజయసాయిరెడ్డి.. అధికార కూటమిలో తెలుగుదేశంలోకి గానీ, జనసేనలోకి గానీ వెళ్లే అవకాశాలు సున్నా. రాజీనామా చేసిన సందర్భంలో పవన్ కల్యాణ్ తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలూ లేవని విజయసాయి సన్నాయి నొక్కులు నొక్కినప్పటికీ.. ఆ పార్టీలోకి ఆయనను రానిస్తారనే నమ్మకం లేదు. తెలుగుదేశం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ముందు మిగిలిన ఏకైక ఆప్షన్ భాజపా మాత్రమే.
పైగా వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా, ఆ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడిగా ఢిల్లీలో ఉన్న రోజుల్లో ఆయన కమలం పెద్దలతో చాలా సత్సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. పార్టీ అనుబంధాలకు అతీతంగా కమలం పెద్దలతో అనుబంధాన్ని పెంచుకున్నారని ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. ఆ రిలేషన్స్ వాడుకుంటూ బిజెపిలో చేరుతారనేది పలువురి అంచనా.
అయితే, విజయసాయి స్థాయిలో అవినీతి ముద్రపడిన వ్యక్తిని బిజెపి చేర్చుకుంటుందా? ఆ పార్టీ మరీ అంతగా దిగజారి చేరికలకు పచ్చజెండా ఎత్తుతుందా? అనే సందేహం పలువురికి ఉంది. విజయసాయి చేరడం వల్ల పార్టీ రెప్యుటేషన్ అడుగంటిపోవడం మాత్రమే కాదు.. పార్టీలో అంతర్గతంగా వాతావరణం కూడా దెబ్బతింటుందని.. ఆయనకు ప్రాధాన్యం ఇస్తే పార్టీని తొలినుంచి నమ్ముకుని నిజాయితీగా పనిచేసే నాయకులకు నైతిక విలువల రాజకీయం మీద నమ్మకం పోతుందని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు.