వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ గురించి ఇటీవల కాలంలో విపరీతంగా ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఆయన ఏ మాట మాట్లాడినా దానిని విశాఖ ఉక్కు ప్రైవేటుకరణ వద్దకు తీసుకువస్తున్నారు. అధికారంలోని ఏ నాయకుడిని, ఏ పార్టీని నిందించినా కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసుకోవాలి అంటున్నారు. అందుకోసం తాను ఢిల్లీలో పెద్దలను కలుస్తానంటూ మాయ మాటలు చెబుతున్నారు. వ్యవహారాలు మొత్తం విశాఖ ఉక్కు చుట్టూ నడిపిస్తున్నారు. ఆయనలో హఠాత్తుగా ఈ ప్రేమ ఎందుకు పొంగుకొచ్చినట్లు అని ప్రజలు అనుమానిస్తున్నారు.
విజయసాయిరెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ఇన్చార్జి. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ కూడా విజయసాయిని ఉత్తరాంధ్రకు పార్టీ ఇన్చార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి! ఇంత బతుకూబతికిన తాము విజయసాయిరెడ్డి నాయకత్వంలో రాజకీయాలు చేయాలా అనే ఆలోచనను, బాధను బొత్స సత్యనారాయణ- జగన్మోహన్ రెడ్డి వద్ద బహిరంగంగానే వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ మాటలను ఖాతరు చేయని జగన్- విజయసాయికే అప్పగించారు. అయితే బొత్స సత్యనారాయణ వ్యక్తం చేసిన ఆవేదన ఆయనదొక్కరిది మాత్రమే కా దని ఇంకా అనేకమంది నాయకులు ఉత్తరాంధ్రలో ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే ఉత్తరాంధ్రలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కూడా విజయసాయిరెడ్డి నాయకత్వాన్ని ఆమోదించే పరిస్థితిలో లేరు. పైగా విజయ సాయి వాళ్లకు పని చెప్పే స్థితికి వస్తే వ్యతిరేకిస్తారు కూడా అనేది విశ్లేషకుల పరిశీలన! ఎంవీవీ సత్యనారాయణ వంటి పార్టీ ప్రముఖులతో స్వయంగా తగాదాలు పెట్టుకొని పంచాయితీలు చేసుకుంటూ ఉండే విజయసాయిరెడ్డికి ఈ పదవి కత్తి మీద సాము.
కాగా పార్టీలో తనకు విశాఖపట్నం పేరుతో ఒక పదవి ఉన్నది కానీ విశాఖలో తనకు ప్రాధాన్యం లేదు అనే సంగతి విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. అందుకే ఆయన పార్టీ వ్యవహారాల సంగతి అటు నుంచి విశాఖ ఉక్కు వంటి విషయాలపై ప్రకటనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐదేళ్లు తమ పార్టీలో అధికారంలో ఉండగా ఆ సమయంలో పూర్తిగా ఆయన రాజ్యసభ సభ్యుడు గానే ఉన్నారు. అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన ను వ్యతిరేకించాల్సిందిగా జగన్కు చెప్పిన పాపాన పోలేదు. అలాంటి పని స్వయంగా చేయనూ లేదు. ఇప్పుడు స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ ఆలోచన లేదు అని ప్రకటించిన తర్వాత వాస్తవంలో ప్రైవేటీకరణ గురించి కేంద్రం పునరాలోచన చేస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయన పరువుతే నష్టం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.