అధికారంలో ఉండగా చేసిన పాపాలకు పరిహారం చెల్లించక తప్పదని మాజీ ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏ పాపం ముందుగా పండుతుందో.. ఏ క్షణాన కటకటాల్లోకి వెళ్ళవలసి వస్తుందో అనే భయంతో ఆయన సతమతం అయిపోతున్నారు. రాష్ట్రంలో ఏ పనిమీద ఎక్కడ పర్యటించినా.. మీడియా ముందు మాట్లాడే అవకాశం ఎక్కడ వచ్చినా ఆయన రెడ్ బుక్ ప్రస్తావన తెస్తారు. రెడ్ బుక్ పరిపాలన రాష్ట్రంలో నడుస్తోందని అడిపోసుకుంటారు.
అసలు ఇంతకూ రెడ్ బుక్ గురించి జగన్ భయపడాల్సిన అవసరం ఏముంది అనేది సాధారణ ప్రజలకు కలుగుతున్న సందేహం. ఎందుకంటే.. నియమ నిబంధనల గీత దాటి అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల దురాగతాలు అన్నీ తాను రెడ్ బుక్ లో నమోదు చేశామని లోకేష్ గతంలో పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. టిడిపి సర్కారు ఏర్పడిన తరువాత.. గతంలో నీతి తప్పిన అధికారులు మాత్రమే రెడ్ బుక్ గురించి భయపడాలి గాని, జగన్ కు భయమెందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జగన్ పరిపాలన సాగుతున్న రోజుల్లో, ఆయన చట్టాలను పట్టించుకోకుండా చెలరేగిన సందర్భాల్లో.. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని టీడీపీ వారు విమర్శించేవారు. దానికి కౌంటర్ గా.. ఇప్పుడు రెడ్ బుక్ పరిపాలన నడుస్తోందని జగన్ అంటున్నారనేది. ఒక వాదన.
అదేసమయంలో మరొక కీలక వాదన కూడా వినిపిస్తోంది.
రెడ్ బుక్ నిజంగానే ఉంటే.. తప్పుడు పనులు చేసిన అధికారుల వివరాలు అందులో ఉంటే.. వారిని విచారిస్తారని జగన్ భయపడుతున్నట్టుగా కొందరు అంచనా వేస్తున్నారు. తనకు వీర భక్తులు ఆయిన అధికార్లను విచారించినా, తన జాతకం బయటకు వస్తుందనే భయం జగన్ లో ఉన్నట్టుగా పలువురు అంచనా వేస్తున్నారు.