నాయకులకు ఇటీవలి కాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. తమ మీద ఏవైనా భారీ ఆరోపణలు వచ్చినప్పుడు.. వారు చిత్రంగా స్పందిస్తున్నారు. నామీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.. చేసిన వారిని ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు ఆదేశించమని చెప్పండి.. ఎలాంటి విచారణకైనా జడిసేది లేదు.. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటానని వారు అనడం లేదు. ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధం అని.. కావలిస్తే తిరుమల వేంకటేశ్వరస్వామి ఎదుట గానీ.. ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన కాణిపాకం వినాయకుడి వద్ద గానీ ప్రమాణం చేస్తామని అంటున్నారు.
తమ మీద ఆరోపణలు చేసిన వారు కూడా ప్రమాణాలు చేయాలని సవాలు విసురుతున్నారు. ఇటీవలి కాలంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదొక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు నాయకుల వంతు దాటి.. వారి అనుచరులు, భృత్యులు కూడా అదే తరహాలో సవాళ్లు విసురుతున్నారు. తాజాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి నుంచి తనకు ప్రాణాపాయం ఉన్నదని పోలీసు కేసు పెట్టిన వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా అలాంటి సవాళ్లు విసురుతున్నారు.
పీఏ కృష్ణారెడ్డి మీద ఇటీవలే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన వైఎస్ అవినాష్ రెడ్డితో కుమ్మక్కు అయి.. వివేకా కూతురు అల్లుడు మరియు సీబీఐ ఎస్పీ రాంసింగ్ మీద పోలీసు కేసు పెట్టినట్టుగా ఆరోపణలున్నాయి. సుప్రీం కోర్టులో రాష్ట్రప్రభుత్వం ఇలాంటి వాదనతోనే అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. అవినాష్ రెడ్డి తెరవెనుక నుంచి సునీత- రాజశేఖర రెడ్డి మీదకు ఆరోపణలు మళ్లించేలా.. కుట్రచేశారని, ఇందుకు ఇద్దరు పోలీసు అధికారుల సాయం తీసుకున్నారని అందులో పేర్కొన్నారు.
సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను విచారణలో థర్డ్ డిగ్రీ ఉపయోగించి హింసించారని పీఏ కృష్ణారెడ్డి ఆరోపిస్తుండగా.. అసలు రాంసింగ్ ఆయనను ఒక్కసారి కూడా విచారించనే లేదని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ఆయన కేసుకు సంబంధించి సాక్షులందరి వాంగ్మూలాలను అవినాష్ కు దగ్గరివారైన ఇద్దరు పోలీసు అధికారులు ఇంట్లో కూర్చుని తయారుచేసినట్లుగా కూడా ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది.
ఈ వాదనకు కౌంటర్ గా పీఏ కృష్ణారెడ్డి చిత్రంగా మాట్లాడుతుండడం విశేషం. రాంసింగ్ తనను విచారణలో కొట్టాడని అంటున్న ఆయన అందుకు ఆధారాలేమిటో చెప్పకుండా.. కావాలంటే దేవుడి మీద ప్రమాణం చేస్తానని అనడం విశేషం. తనను బెదిరించలేదని సునీత రాజశేఖర రెడ్డి కూడా దేవుడి మీద ప్రమాణం చేయాలని ఆయన సవాలు విసురుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరికి వారు తాము ప్రమాణాలు చేస్తాం.. అని దేవుడిని అడ్డు పెట్టుకుంటే.. ఈ దేశంలో ఇక చట్టాలెందుకు? కోర్టులెందుకు? అని ప్రజలు అనుకుంటున్నారు. పీఏ కృష్ణారెడ్ది తనకు అవినాష్ రెడ్డితో సంబంధం లేదని చెప్పదలచుకుంటే.. చట్టపరంగా విచారణలోనే ఆ విషయం నిరూపించుకోవాలనే వాదన వస్తోంది.