వైఎస్ జగన్ మీద గులకరాయి పడిన కేసు విచారణలో తమ పాత్ర కళంకితం కాకుండా ఉండేందుకు పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏపీ పోలీసులు జగన్ ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారనే ప్రతిపక్షాల విమర్శలు మిన్నంటుతూ ఉండగా.. ఇలాంటి కీలకమైన కేసు పరిష్కారంలోనైనా పోలీసులు తమ చిత్తశుద్ధిని, నిజాయితీని అడుగడుగునా నిరూపించుకోవాలి. జగన్ మీద పడిన రాయి విషయంలో అది హత్యాయత్నం అని తొలుత కేసులు నమోదు చేశారు. కానీ ఇప్పుడు సెక్షన్లు మార్చాల్సిందేనని, రిమాండు రిపోర్టులో పోలీసులే పేర్కొన్న వివరాలను బట్టి.. దాన్ని హత్యాయత్నంగా పరిగణించడానికి వీల్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ కు గాయం అయినప్పుడు పోలీసుల ఊహాగానాలు వేరు. అప్పటి పరిస్థితులు కూడా వేరు. అప్పటి అనుమానాలు కూడా వేరు. రాయి వచ్చిన తీరు, అంత విసురుగా వచ్చి జగన్ నుదుటి మీద గాయం చేసిన తర్వాత.. పక్కనే ఉన్న వెలంపల్లికి కూడా తగిలిన తీరును బట్టి దానిని క్యాట్ బాల్ తో ప్రయోగించి ఉండవచ్చునని అప్పుడు పోలీసులు భావించారు. క్యాట్ బాల్ కాదు.. ఎయిర్ గన్ తో కాల్చారని సాక్షిమీడియా, వైసీపీ నాయకులు కట్టుకథలను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత పోలీసులు కూడా అదే పాట అందిపుచ్చుకున్నారు. అలా క్యాట్ బాల్ లేదా ఎయిర్ గన్ తో ప్రయోగించారనే అనుమానాల నేపథ్యంలో హత్యాయత్నం కేసు పెట్టారు.
కానీ ఇప్పుడు సతీష్ అనే కుర్రవాడిని నిందితుడిగా చూపిస్తూ రిమాండ్ రిపోర్టు కూడా తయారుచేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రిపోర్టులో పోలీసులు చెబుతున్న వివరాలు వేరు. వడ్డెర కాలనీకే చెందిన దుర్గారావు.. జగన్ మీద రాయితో దాడిచేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని సతీష్ కు ఆశ చూపించినట్టుగా ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇది మరొక బాలుడు సాక్షిగా తయారైన స్టేట్మెంట్. పోలీసులు చూపిస్తున్న ప్రధానమైన ఆధారం ఇదే. మొత్తానికి క్యాట్ బాల్, ఎయిర్ గన్ ప్రస్తావ లేదని తేలిపోయింది. కేవలం చేత్తో రాయివిసిరినట్టుగా పోలీసుల రిపోర్టే తేల్చేస్తోంది.
మరి అలాంటప్పుడు హత్యాయత్నం కేసు ఎలా పెడతారు? అనేది ప్రజల సందేహం. 20-30 అడుగుల దూరం నుంచి ఒక గులకరాయిని వ్యక్తి మీదకు విసిరి అలా చంపేయడం సాధ్యమేనా? చంపేయాలనే ఉద్దేశంతో అలా గులకరాయి విసరడం జరుగుతుందా? దుర్గారావు ఆశపెట్టాడని అంటున్నారు కదా.. మరి దాడిచేయమని చెప్పినట్టుగా స్టేట్మెంట్ ఉన్నది తప్ప.. చంపమని పురమాయించినట్టు కాదుకదా! ఇన్ని అంశాలు వారి నివేదికలోనే తేడా కొడుతుండగా.. ఇంకా హత్యాయత్నం సెక్షన్లు కింద కేసు నడపం దారుణం అనే వాదన వినిపిస్తోంది. జగన్ మీద కూడా పదునైన ఆయుధంతో దాడి కిసంబంధించిన సెక్షన్ల కిందనే కేసులు పెడితే పోలీసులు నిజాయితీగా వ్యవహరించినట్టు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.