అమ్మని ప్రేమించే జగన్ ఆ పని ఎందుకు చేయలేదో?

జగన్మోహన్ రెడ్డి- ఆయన తల్లి విజయమ్మ ల నడుమ అవ్యాజమైన ప్రేమానురాగాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ప్రతి తల్లీకొడుకుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో.. అలాంటి అనుబంధం వారి మధ్య కూడా పుష్కలంగా ఉంది. సెలబ్రిటీలు గనుక.. వారి మధ్య ప్రేమ ప్రజలకు కూడా కనిపిస్తూ ఉంటుంది. కొడుకు ఎక్కడ తారసపడినా.. విజయమ్మ ఆయనకు ముద్దు పెట్టకుండా ఉండిన సందర్భాలు ఉండవు. అలాంటిది తనను అంతగా ప్రేమించే తల్లికోసం జగన్ ఏం చేశారు? ఏం శ్రద్ధ చూపించారు? తల్లిని అవమానించిన వారిపట్ల ఆయన ఎందుకు స్పందించడం లేదు?

వర్రా రవీందర్ రెడ్డి తమకు తెలియదు అని ఇప్పుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతోంది. కాసేపు ఇది నిజమే అనుకుందాం. మరి వర్రా ఎవరో వైసీపీ వారికి తెలియనప్పుడు.. సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి తల్లి గురించి.. ఆయన చెల్లి యొక్క పుట్టుక గురించి అసభ్యమైన నీచమైన రాతలు రాస్తే జగన్ దళాలు ఏం చేస్తున్నాయి. తన చెల్లి పుట్టుక తన తండ్రి వల్ల జరగలేదని అత్యంత అసహ్యంగా వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెడితే.. వైసీపీ నాయకులు ‘తమకు తెలియని’ ఆ వ్యక్తి మీద తమంతగా తాము ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఊరుకుండిపోయారు? అలాంటి పోస్టులకు సిగ్గుపడి ముందుగా వర్రా మీద చర్యకు ఉపక్రమించి ఉండాల్సింది వాళ్లే కదా అనే సందేహాలు ఇప్పుడు  తలెత్తుతున్నాయి.

తన సొంత తల్లి గురించి అంత అవమానకరంగా వర్రా రవీందర్ రెడ్డి పోస్ట్లు పెట్టినప్పుడు.. తల్లిని ప్రేమించే కొడుకుగా జగన్ స్వయంగా కేసులు పెట్టి ఉండాలి. పైగా చాలా అసభ్యమైన నీచమైన భాషలో పెట్టిన పోస్టు అది. అలాంటి పోస్టు జగన్ తల్లి మీద పెట్టినప్పుడు.. దాన్ని చదివిన మామూలు వ్యక్తులకే.. వారు వైఎస్ రాజశేఖర రెడ్డికి గానీ, విజయమ్మకు గానీ అభిమానులు కాకపోయినా సరే రక్తం ఉడుకుతుంది. ఏ తల్లి గురించి అయినా అలాంటి మాటలు తగవు.. అలాంటివాడిని కఠినంగా శిక్షించి తీరాల్సిందే అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం చీమకుట్టినట్టయినా లేకపోవడం పలువురికి అనేక సందేహాలను కలిగిస్తోంది.

వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు అయిన తర్వాత.. పోలీసుల విచారణలో అవినాష్ రెడ్డి పేరుతో సహా, ఐప్యాక్ నుంచి వచ్చిన కంటెంట్ నే తాము పోస్టు చేసేవాళ్లం అని వర్రా చెప్పిన తర్వాత.. వైసీపీ ఉలిక్కి పడింది. అసలు వర్రా రవీందర్ రెడ్డి తమకు తెలియదని, ఆయన తమ పార్టీ కార్యకర్త కానే కాదని వైసీపీ మాజీ మంత్రులు, నాయకులు మీడియా ముందు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మనిషి కానప్పుడు.. అలాంటి పోస్టుల గురించి విజయమ్మ మర్యాదను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత జగన్ అనుచరులకు లేదా? అనేది ప్రజల సందేహం. పోలీసులకు జగనే ఎందుకు ఫిర్యాదు చేయలేదా అని ప్రజలు అనుమానించడంలో తప్పేముంది?

Related Posts

Comments

spot_img

Recent Stories