పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. బహిరంగ సభలో పవన్ కల్యాణ్.. కొన్ని సందర్భాల్లో ఆవేశపూరితంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రత్యర్థుల దుర్మార్గాలను ప్రస్తావిస్తూ వారిని నిలదీసే మాటలు బయటకు వస్తున్నప్పుడు ఆయనలో చాలా సహజంగా ఆ ఆవేశం తీవ్రమైన స్థాయిలో బయటకు వస్తుంటుంది. ఆగ్రహంతో ఆయన ఊగిపోతుంటారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఊగిపోవడం మాత్రం తెగ నచ్చినట్టుగా ఉంది. ఆయనలాగా తాను కూడా ఊగిపోతూ ఆవేశంగా ప్రసంగించాలని జగన్ అనుకుంటున్నట్టుగా ఉంది. మరి ఆవేశం ఎలా ఏ విషయాలపై ప్రదర్శించాలో ఆయనకు తెలియదు. అందుకే సందర్భశుద్ధిలేకుండా ఏదేదో మాట్లాడుతూ.. ప్రతి మాటకూ పొలికేకలు పెడుతున్నారు. జగన్ పెడుతున్న పొలికేకలు ప్రజలకు చాలా కామెడీగా కనిపిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు తన పార్టీ తరఫున ‘మేమంతా సిద్ధం’ అంటూ ఎన్నికల ప్రచారాన్ని, బస్సు యాత్ర రూపంలో ప్రారంభించారు. ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి.. బస్సుయాత్రను ప్రారంభించారు. బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభల్లో ఆయన ప్రసంగం తీరే చిత్రంగా ఉంది.
నాయకులు ప్రసంగాల్లో భాగంగా ఏదైనా ఆవేశపూరితమైన విషయాలు, ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయాల్సి వస్తే.. అప్పుడు కాస్త అతిగా స్పందించడం ఊగిపోవడం జరగవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి.. మనం ఈసారి ఎన్నికల్లో 175కు 175 స్థానాలూ గెలవాలి అనే మాట చెప్పడానికి కూడా పొలికేకలు పెడుతున్నారు. అంతకంటె సాధారణమైన మామూలు మాటలు చెప్పడానికి కూడా ఆయన పెద్దపెట్టున పొలికేకలు పెట్టడం అనేది వింటున్న వారికి తమాషాగా ఉంది.
పాపం జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ప్రచార సభలు చాలా కష్టంగా ఉంటున్నాయి. నన్ను ఒక్కడినీ ఓడించడానికి వాళ్లు ముగ్గురూ కలిసి వస్తున్నారు.. ఎందుకంటే.. ఒక్కడిగా రావాలంటే వాళ్లందరికీ భయం అంటున్నారు. అలా ఆయన ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. కానీ.. బిజెపిని ప్రస్తావించి డైరెక్టుగా ఒక్క విమర్శ కూడా చేయలేకపోతున్నారు. ఇది ఆయన బలహీనతగా స్పష్టంగా కనిపిస్తోంది. తన మీద ఉన్న కేసులకోసం జగన్ బిజెపిని పల్లెత్తు మాట అనలేకపోతున్నారని సర్వత్రా విమర్శలు ఉన్నాయి.
తనను ఓడించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దల కాళ్లు పట్టుకుని పొత్తులు కుదుర్చుకున్నారని కూడా జగన్ ఆరోపిస్తున్నారు. చంద్రబాబు వారి కాళ్లు పట్టుకున్నారో లేదో ఎవ్వరూ చూళ్లేదు. కానీ.. మోడీ ఏపీలో అడుగుపెడితే చాలు.. ఎయిర్ పోర్టులో కనపడగానే సాంతం ఆయన కాళ్ల మీద పడిపోతూ.. ప్రతి సందర్భంలోనూ తన భక్తిని ప్రదర్శించుకునే జగన్మోహన్ రెడ్డి వైఖరిని మాత్రం ప్రజలందరూ అనేక సందర్భాల్లో చూశారు. అలాంటి జగన్.. చంద్రబాబు వెళ్లి కాళ్లమీద పడ్డారంటూ విమర్శలు చేయడం సంకుచితంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.