ఆస్తుల కోసం తోబుట్టువుల మధ్య ఘర్షణలు, తగాదాలు చాలా కుటుంబాల్లో ఉంటాయి. తన కుటుంబంలోని ఇలాంటి వివాదాలు బయటపడినప్పుడు.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారు. ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉండేవే కదా అని అన్నారు. కానీ.. ఉన్న ఆస్తుల్ని ఏదో తలాకొంచెం పంచుకుని వాటితో పొట్టపోసుకోవాలని ఆలోచించే కుటుంబాల్లో ప్రతి రూపాయి గురించి తగాదా పడుతూ పంచుకోవడం ఒక ఎత్తు. కానీ లక్ష్లల కోట్ల రూపాయలకు ఉన్నది ఇద్దరే వారసులు. అలాంటిది సొంత చెల్లెలినే మోసం చేసి వేలకు వేల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా తన పరం చేసుకోవాలనేంత కోరిక జగన్మోహన్ రెడ్డికి ఎందుకు? అనే ఆలోచన ఇప్పుడు ప్రజల్లో కలుగుతోంది. ఆమెకు నిజాయితీగా సగం పంచినా సరే… ఆయనకు మిగిలే సంపద చిన్నదేమీ కాదు.. అలాంటిది.. చెల్లెలిని వంచించడానికి ఎందుకన్ని కుట్రలు చేశారు. తన పార్టీలోని కీలక వ్యక్తులను, తన చెప్పు చేతల్లో ఉండేవారిని ఎందుకు ఆ కుట్రలో భాగస్వాముల్ని చేశారు. అంత ఆస్తి పిచ్చి ఏమిటి? అని ప్రజలు చీదరించుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. మొన్నటిదాకా జగన్ తర్వాత నెంబర్ టూ గా చెలామణీ అయిన విజయసాయిరెడ్డి.. వైఎస్ షర్మిల ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ అయిన సంగతి అందరికీ తెలుసు. ఆమె ఆతిథ్యం స్వీకరించి గంటల కొద్దీ అనేక విషయాలు చర్చించుకున్నారు. అయితే ఆ భేటీలో విజయసాయి చెప్పిన మాటలేంటో.. ఇప్పుడు షర్మిల బయటపెట్టారు.
కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో షర్మిల చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ మీడియా ముందుకు వెళ్లి చెప్పాలని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద అప్పట్లో జగన్ తీవ్రమైన ఒత్తిడి తెచ్చారట. తమ భేటీలో సారాంశంగా ఈ విషయాలు తెలిసినట్టు షర్మిల మీడియాకు స్వయంగా వెల్లడించారు. విజయసాయి గతంలో అలాంటి ప్రకటన చేసిన సమయంలోనే.. ఆయన అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటూ షర్మిల నిందించిన సంగతి తెలిసిందే. అలాగే.. ఆయన రాజీనామా ప్రకటన తర్వాత కూడా.. విజయసాయి ఇప్పటికైనా నిజాలు చెప్పడం అలవాటు చేసుకోవాలని షర్మిల దెప్పిపొడిచారు. ఈ నేపథ్యంలో విజయసాయి తన ఇంటికి వచ్చి తెరవెనుక సంగతిని వివరించినట్టు షర్మిల చెబుతున్నారు. ‘వైఎస్ఆర్ ఇద్దరు బిడ్డలకు సమాన వాటా ఉండాలని కోరుకున్నారని, ఇది విజయమ్మ- భారతి సమక్షంలో జరిగిన నిర్ణయం అని దానికి వ్యతిరేకంగా మాట్లాడలేనని విజయసాయి చెప్పినప్పటికీ.. జగన్ ఒప్పుకోలేదట. తాను ఫోనులో పురమాయించి, ఒప్పుకోకపోయాక, మళ్లీ వైవీ సుబ్బారెడ్డిని రాయబారం పంపి ఒత్తిడి చేసి విజయసాయితో అలా చెప్పించారట.
ఈ సంగతి తెలిసినప్పుడు.. చెల్లెలి ఆస్తుల వాటాలను కాజేయడానికి జగన్ ఇన్ని కుట్రలు చేస్తున్నారే.. ఆయనేమీ పేదవాడు కాదు కదా.. ఇదేం బుద్ధి అని ప్రజలు అనుకుంటున్నారు.