వైఎష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని కోరుకున్న ప్రజలు 2019లో ఆయనకు 151 మంది ఎమ్మెల్యేల బలాన్ని కట్టబెట్టారు. దాని ఫలితమే అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఆ విధ్వంసక పరిపాలనతో విసిగివేసారి పోయిన ప్రజలు.. జగన్ వద్దని ఎంత బలంగా కోరుకున్నారంటే.. ఆయన పార్టీ 2024లో కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది. ఆయనకు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరాదని ప్రజలు చాలా గట్టిగా అనుకోబట్టి అన్ని తక్కువ సీట్లలో గెలిపించారు. కనీసం 18 ఎమ్మెల్యే స్థానాలు దక్కి ఉంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అనే ఒక హోదా, తదనుగుణంగా కేబినెట్ ర్యాంకు జగన్ కు దక్కి ఉండేవి. అయితే.. ఇప్పుడు అవి కూడా లేవు. ప్రజలు తిరస్కరించిన సదరు హోదాను, శాసనసభ స్పీకరు అఫిడవిట్ ద్వారా ఇవ్వాలంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎందుకు ముష్టెత్తుకుంటున్నారో అర్థం కావడం లేదని ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఎమ్మెల్యే అంటే.. శాసనసభకు హాజరై ప్రజల సమస్యలను, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను ప్రస్తావించడం ప్రాథమిక బాధ్యత. కానీ.. జగన్ తన అహంకారం కొద్దీ.. తాను డుమ్మా కొట్టడం మాత్రమే కాదు. మొత్తం తన పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలను కూడా శాసనసభకు వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్నారు. తద్వారా వారి నియోజకవర్గాల్లో ప్రజలు కూడా ఆయా ఎమ్మెల్యేలను అసహ్యించుకునే పరిస్థితిని జగన్ సృష్టిస్తున్నారు. జగన్ నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే.. ఆపార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రజలు చూశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్న రాజంపేటి నియోజకవర్గ పరిధిలో ఒంటిమిట్ట జడ్పీటీసీకి ఉపఎన్నిక జరిగితే.. అక్కడ ఎలాంటి పరాజయం ఎదురైందో ప్రజలందరూ చూశారు. ఇదంతా కూడా.. కనీసం తమ ప్రతినిధిగా సభకు వెళ్లకుండా ఈ ఎమ్మెల్యేలు ఆడుతున్న నాటకాలపై ప్రజల్లో ఏర్పడిన అసహ్యం కూడా ఒక కారణం అని అంతా అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రజల్లో కాస్త పరువు దక్కించుకోవాలన్నా.. సాంకేతికంగా తమ మీద అనర్హత వేటు పడకుండా ఉండాలన్నా శాసనసభకు హాజరు కావడం మంచిదనే అభిప్రాయం మిగిలిన పది మంది ఎమ్మెల్యేల్లో ఉంది. అయినా సరే.. జగన్ వారిని కూడా అనుమతించడం లేదు.
తాజాగా జగన్ ఇంట్లోకూర్చుని చేస్తున్న విమర్శలపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దమ్ముంటే అసెంబ్లీకి రా, అక్కడ చర్చించుకుందాం అని సవాలు విసిరిన నేపథ్యంలో.. జగన్ కు డీఫ్యాక్లో పర్సనాలిటీ అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే శాసనసభకు వస్తారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రజలు తిరస్కరించిన హోదాను ఎందుకు ముష్టెత్తుతున్నారో అర్థం కావడం లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కు తగిన సమయం సభలో కేటాయిస్తాం అని స్పీకరు అఫిడవిట్ ఇవ్వాలని సజ్జల అంటున్నారు. ఇలాంటి మడత పేచీలు పెట్టకుండా.. అసెంబ్లీకి వెళ్లినప్పుడే.. ప్రభుత్వ వైఫల్యాలుంటే అక్కడ నిలదీసినప్పుడే జగన్ దళానికి పరువు దక్కుతుందని ప్రజలు అంటున్నారు.