పేర్ని నానికి చెందిన గోడౌన్ల నుంచి భారీ ఎత్తున రేషన్ బియ్యం మాయం అయ్యాయి. నేరం బయటపడిపోయిన తరువాత.. అధికారులు విధించే జరిమానా కట్టేస్తే సరిపోతుందని అనుకున్న వారి పాచిక కూడా పారలేదు. ఆ గోడౌన్లు అన్నీ పేర్ని నాని భార్య జయసుధ పేరు మీద ఉండడంతో ఆమె ఏ1గా కేసులు నమోదు అయ్యాయి. ఆమెను అరెస్టు చేస్తారనే భయంతో కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లింది. ఈలోగా ఆమె తరఫు బెయిల్ పిటిషన్ జిల్లా కోర్టులో నెగ్గింది. విచారణకు హాజరు కావాలంటూ.. జయసుధకు కోర్టు ముందస్తు బెయిలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం జయసుధ పోలీసు విచారణకు హాజరయ్యారు. పోలీసులు విచారించి పంపారు. ఆమె మరోసారి కూడా విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఇదంతా ఇప్పటిదాకా జరిగిన వ్యవహారం. అయితే.. వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయం అయిన కేసుల్లో ఏ1 అయిన పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తే అందుకు జగన్ దళాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయో అర్థం కావడం లేదు. రాజకీయ కక్ష సాధింపుకోసం మహిళల్ని అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదంటూ జగన్ కరపత్రికలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ఆ పార్టీ నాయకులు నంగి ఏడుపులు ఏడుస్తున్నారు.
గోడౌన్లు జయసుధ పేరిట ఉన్నాయి. ప్రభుత్వంతో ఒప్పందం ఆమె పేరిటఉంది. మరి అలాంటప్పుడు బియ్యం మాయం అయితే.. జయసుధ మీద కాకుండా.. వేరే వాళ్ల మీద కేసులు ఎలా బనాయిస్తారు? అనేది ప్రజల సందేహం. సాధారణంగా రాజకీయ నాయకులు బినామీల పేర్ల మీద ఆస్తులు నడిపిస్తుంటారు. బినామీల పేరిట పెడితే వారే కాజేస్తారనే భయం ఉన్నదో లేదా, అధికారంలో ఉన్నది తామే కదా తమను ఎవరేం చేయగలరనే ధీమా అప్పట్లో ఉన్నదో గానీ.. పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఈ గోడౌన్లు పెట్టారు. ఫలితంగా ఆమె విచారణ ఎదుర్కోవాల్సి వస్తే.. మహిళను వేధిస్తున్నారంటూ పార్టీ నాయకులు విలపిస్తున్నారు.
పైగా.. పేర్ని జయసుధ పోలీసు విచారణకు తమ పార్టీ మహిళా నాయకుల్ని, న్యాయవాదుల్ని పలువురిని వెంటబెట్టుకుని స్టేషనుకు వచ్చారు. న్యాయవాదుల్ని కూడా పోలీసులు లోనికి రానివ్వలేదు. ఆమె వెంట వచ్చిన మహిళా నాయకుల్ని కూడా రానివ్వలేదు. న్యాయవాదులకే ఎంట్రీ లేనప్పుడు.. సహచర అనుచర మహిళలను ఎందుకు అనుమతిస్తారు. పోలీసు విచారణ అంటే ఆమె ముఖ్యఅతిథిగా హాజరవుతున్న పబ్లిక్ మీటింగ్ కాదు కదా.. అనుచరుల్ని వెంటబెట్టుకుని వెళ్లడానికి! అయితే.. అలా వారిని అడ్డుకున్నందుకు కూడా పోలీసుల తీరును విమర్శించడం హాస్యాస్పదంగా మారుతోంది.