సీఐడీ విచారణ ఎందరి మెడకు బిగస్తుందో?

జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో మద్యం వ్యాపారం రూపేణా జరిగిన వేల కోట్ల దందాలో.. ఎన్నెన్ని అక్రమాలు జరిగాయనేది ఎవ్వరి ఊహకు కూడా అందని సంగతి. అంత బీభత్సంగా జగన్ అనుయాయులు దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. లిక్కర్ వ్యాపారంలో లొసుగులు ఒక్కొక్కటి బయటకు వస్తుండగా ప్రభుత్వమే నివ్వెరపోతోంది.

తాజాగా గత అయిదేళ్లలో లిక్కర్ వ్యాపారం ఆనుపానులు రాబట్టేందుకు సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టుగా చంద్రబాబునాయుడు ఆదేశించారు. పూర్తిస్థాయి విచారణ జరిగితే.. గత ప్రభుత్వంలోని ఎందరు పెద్దలు కటకటాల వెనక్కు వెళ్లవలసి వస్తుందో అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మొత్తానికి కేంద్రబిందువు అయిన వాసుదేవ రెడ్డి మీద సీఐడీ ఇప్పటికే విచారణ సాగిస్తున్న సంగతి తెలిసిందే. పలు ఫైళ్లను, హార్డ్ డిస్కులను వారు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు సాగుతోంది. అయితే మొత్తం 99 వేల కోట్ల రూపాయల వ్యాపారంలో మూడు శాతానికి పైగా అవినీతి జరిగినట్టుగా చంద్రబాబునాయుడు  తన శ్వేతపత్రం సమర్పణ సందర్భంగా వివరించారు.

అంటే మూడువేల కోట్ల పైచిలుకు అవినీతి జరిగిందని చెప్పారు. అయితే.. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గానీ, బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గానీ.. దీనిని ఖండించడం గమనార్హం.
మూడు వేలు అవినీతి జరిగినట్టుగా శ్వేతపత్రం చెబుతున్న లెక్కలనుచూస్తే జగన్ ఎంతో సంతోషిస్తారని.. నిజానికి 30 వేల కోట్ల రూపాయలకు పైగా స్వాహా చేశారని రాజు చెప్పుకొచ్చారు.

మొత్తానికి లిక్కర్ వ్యాపారంలో కనీసం బిల్లులు ఇవ్వకుండా, ఒక్క ఆన్ లైన్ చెల్లింపులను కూడా అనుమతించకుండా, బ్రాండెడ్ లిక్కర్ ఏదీ రాష్ట్రంలోకి రానివ్వకుండా జగన్ సర్కారు సాగించిన అపరిమితమైన అవినీతి బాగోతం అసలు గుట్టుమట్టులన్నీ వెలుగులోకి రాబోతున్నాయి. మద్యం తయారీదార్లను బెదిరించి.. వైసీపీ నాయకులే బినామీ పేర్లతో వాటిని దక్కించుకుని సాగించిన దందాలన్నీ వెలుగులోకి వస్తాయి. సీఐడీ విచారణలో ఎందరు వైసీపీ నేతలు కటకటాల వెనక్కు వెళ్లాల్సి వస్తుందో.. ఎంతమంది ప్రముఖులు ఉంటారో అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories