సీనియర్ నటి మీనా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పెద్ద స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె జీ5లో ప్రసారమవుతున్న జగపతి బాబు హోస్ట్‌గా చేసే టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురాలో పాల్గొని తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మీనా చెప్పిన ప్రకారం, తన కెరీర్‌లో కొన్ని సందర్భాల్లో నిర్మాతలు తక్కువ బడ్జెట్ సినిమాలకు ఆమెను సంప్రదించేవారని, అప్పట్లో తాను కూడా అవే ప్రాజెక్టులు ఒప్పుకుని నటించేదాన్నని చెప్పారు. అలాంటి సినిమాలు హిట్ అయిన తర్వాత తనను పట్టించుకోకుండా వదిలేస్తారని, ఈ అనుభవం చాలా సార్లు ఎదురైందని తెలిపారు.
అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ, సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత తల్లి అయిన రెండేళ్లకే మలయాళ చిత్రం దృశ్యం కోసం సంప్రదించారని చెప్పారు. చిన్నపాపను వదిలి బయటకు వెళ్లాలనిపించక మొదట తిరస్కరించానని, కానీ ఆ పాత్రను ప్రత్యేకంగా తనకోసం రాశారని చెప్పి దర్శకులు మళ్లీ అభ్యర్థించడంతో చివరికి అంగీకరించానని తెలిపారు.
అలాగే మీడియా రాసిన వదంతులు తనను ఇబ్బంది పెట్టాయని మీనా అన్నారు. విడాకులు తీసుకున్న ఎవరికైనా తనతో పెళ్లి అనే రూమర్స్ వచ్చేవని, అలాంటి వార్తలు తనకు అసహనం కలిగించేవని చెప్పారు.