‘ఒక కుక్కను నువ్వు చంపదలచుకుంటే.. ముందుగా దాని మీద పిచ్చిది అనే ముద్ర వేయి’ అని ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. రాజకీయ నాయకులు ఈ సిద్ధాంతాన్ని చాలా చక్కగా ఫాలో అవుతుంటారు. తమకు కిట్టనివాళ్ల మీద ఒక రకమైన అసమర్థత ముద్ర వేసేసి.. ఆ తర్వాత వారి పతనానికి ఇతర మార్గాలు వెతుకుతుంటాు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు అదే తరహా సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. తనకు ఎవరు నచ్చకపోయినా సరే.. తన తండ్రి వైఎస్సార్ ను చంపించింది వారే అని ప్రచారం చేయడమే ఆ టెక్నిక్ అన్నట్టుగా ఆయన వ్యవహారం సాగుతోంది.
కాంగ్రెసు పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి తాజాగా మాట్లాడుతూ జగన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ కు డబ్బు పిచ్చి, అధికార పిచ్చి ఉన్నాయని వాటికోసం ఎంతకైనా దిగజారతారని తులసిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఉన్నారని గతంలో జగన్ ఆరోపించిన వైనం ఆయన గుర్తుచేశారు. వైఎస్ అభిమానులను రెచ్చగొట్టడంతో వారు రిలయన్స్ ఆస్తులపై దాడులు నిర్వహించి విధ్వంసం చేశారన్నారు. జగన్ గతంలో వైఎస్ఆర్ ను చంపించింది.. రిలయన్స్ అంటూ ఆరోపించిన మాట వాస్తవం. అయితే తమాషా ఏంటంటే.. అదే జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుంగు అనుచరులు ఇప్పుడు.. వైఎస్ఆర్ ను చంపించింది- కాంగ్రెస్ పార్టీ మరియు చంద్రబాబు అని ఆరోపిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న అత్యంత లేకి రాజకీయ ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు.
తమాషా ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న ప్రజాదరణ ఆయన మరణం పట్ల ఉన్న ప్రజల్లోని సానుభూతి తప్ప.. తన రాజకీయ భవిష్యత్తుకు మరొక ఆధారం లేనేలేదని ఇప్పటికీ నమ్ముతున్నారు. అందుకే ఆయన ఇప్పుడు వైఎస్ మరణం అంశాన్ని హత్యగా రంగు పులుముతూ ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు.
తల్లిని కోర్టుకీడ్చిన జగన్ తీరుపై విరుచుకు పడుతున్న షర్మిలకు సమాధానం చెప్పలేక తన అనుచరుల్ని ఆమె మీదికి ఉసిగొల్పుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ ను చంపించిన కాంగ్రెస్ మరియు చంద్రబాబుతో దోస్తీకట్టి షర్మిల పనిచేస్తున్నారంటూ చవకబారు ఆరోపణలు చేశారు. అసలు వైఎస్ మరణానికి కాంగ్రెసు పార్టీకి లేదా, చంద్రబాబునాయుడుకు సంబంధం ఎలా ముడిపెట్టగలరో వారికే అర్థం కావాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి.. తనకు ఎప్పుడు ఎవరు గిట్టకపోతే.. వారి మీద తండ్రిని చంపించారనే ముద్ర వేస్తూ బతకదలచుకున్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.