రాష్ట్రంలో పోలీసులు ఎంత అచేతనంగా పనిచేస్తున్నారో పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన స్వరంలో తెలియచెప్పారు. క్రిమినల్స్ భయపడేలాగా పోలీసు యంత్రాంగం పని చేయాల్సిన బాధ్యతను ఆయన తెలియజేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావన తీసుకువచ్చి హెచ్చరించడం అంటే క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తే లాగా పోలీసు యంత్రాంగం విధులు నిర్వర్తించాలనేదే ఆయన సూచన! ప్రధానంగా మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి పోలీసులు కఠినంగా ఉండాల్సిందే అని పవన్ హెచ్చరించడం గమనించాలి!!
అయితే పవన్ వ్యాఖ్యల్లోని ఈ సారాంశాన్ని మొత్తం పక్కకు మళ్ళించి.. హోం మంత్రి అనిత పనితీరును కించపరిచేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు- అనే కుటిల ప్రచారం వ్యతిరేక మీడియా ద్వారా జరుగుతున్నది. ‘నేను గనుక హోం శాఖను తీసుకుంటే పరిస్థితులు ఇలా ఉండవు అని పవన్ కళ్యాణ్ అన్నంత మాత్రాన ఆయన హోం మంత్రిని కించపరిచినట్లు కాదు. అది కేవలం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం మాత్రమే. పవన్ వ్యాఖ్యల పట్ల సిగ్గుపడాల్సింది లేదా బాధపడాల్సింది హోం మంత్రి కాదు. పోలీసులు, వారికి సారధి అయినటువంటి డిజిపి మాత్రమే అని ప్రజలు అనుకుంటున్నారు.
పోలీసు శాఖలో బాస్ ఏం చెబితే అదే చెల్లుబాటు అయ్యే ధోరణి నూటికి నూరు శాతం ఉంటుంది. పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేసినా.. ఒక పార్టీకి తొత్తుల్లాగా, ఆ పార్టీ నాయకుల ఇంటి పాలేరుల మాదిరిగా పనిచేసినా.. మనం వారిని ఎన్నైనా విమర్శించవచ్చు కానీ.. ఆ విమర్శలు వారికి అంటవు! ఎందుకంటే ఆ శాఖ ‘ఎస్ బాస్’ ధోరణికి అలవాటు పడిన శాఖ! బాస్ ఏ విధంగా ఉంటే మొత్తం పోలీసు వ్యవస్థ అదే రీతిలో సాగుతుంటుంది. బ్రిటిష్ కాలం నుంచి పోలీసులకు నరనరానా జీర్ణించుకుపోయిన పద్ధతి అది! ఈ నేపథ్యంలో మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలపై- పోలీసు యంత్రాంగం సరిగా పనిచేయడం లేదు అని పవన్ వ్యాఖ్యానించారంటే అందుకు ముందుగా పోలీసు బాస్ డిజిపి బాధపడాలి. తన యంత్రాంగాన్ని మరింత చురుగ్గా పనిచేసేలా ప్రేరేపించడానికి ఏం చేయగలనో ఆయన ఆలోచించాలి. కేవలం మంత్రి అరిచినంత మాత్రాన, సమీక్ష సమావేశాలు పెట్టినంత మాత్రాన, రంకెలు వేసినంత మాత్రాన యంత్రాంగం సమూలంగా మారిపోతుందని అనుకోవడం భ్రమ. కానీ అసలైన చైతన్యం డిజిపిలో రావాలి. ఆయన చిత్తశుద్ధిగా పవన్ మాటల స్ఫూర్తిని తీసుకుంటే గనుక- యంత్రాంగంలో ఉండే అలసత్వ ధోరణి, పుచ్చిపోయిన బుద్ధులు మొత్తం ప్రక్షాళన అవుతాయి.. అని ప్రజలు నమ్ముతున్నారు. మరి పవన్ వ్యాఖ్యలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో ముందు ముందు తేలుతుంది.