ఉద్యోగార్థుల జీవితాలతో జగన్ సర్కారు ఆటలాడుకున్న దుర్మార్గపు వ్యవహార సరళికి కళ్లెదుట కనిపిస్తున్న నిదర్శనం గ్రూప్ 1 ప్రశ్నపత్రాల మూల్యాంకనం వ్యవహారం. ఈ స్కామ్ లో ఇప్పటికే కేసు నమోదు అయిఉంది. ఏ1 నిందితుడిగా అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా చేసిన పీఎస్సార్ ఆంజనేయులు ఉన్నారు. మరో నిందితుడిగా.. ‘మూల్యాంకనం కాంట్రాక్టు’ తీసుకున్న ధాత్రి మధు కూడా రిమాండులో ఉన్నారు. అయితే కొత్తగా ఇప్పుడు వెంకటసుబ్బయ్య పేరు తెరమీదకు వస్తోంది. ‘చెప్పెడి వాడు.. పీఎస్సార్ ఆంజనేయులు అయితే.. ఈ సమస్త అక్రమాలను, చేయించెడివాడు ఈ వెంకటసుబ్బయ్య’ అని తేలుతోంది. ఉద్యోగానికి సెలవు పెట్టి ప్రస్తుతానికి అమెరికా పారిపోయి ఉన్న ఈ వెంకటసుబ్బయ్య కోసం ఇప్పుడు పోలీసులు నిరీక్షిస్తున్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత.. తెరవెనుక ఉన్న అనేక రహస్యాలు తెలుస్తాయని కూడా పోలీసులు నమ్ముతున్నారు.
హైకోర్టు మాన్యువల్ గా మూల్యాంకనం చేయించాలని ఆదేశిస్తే.. ఒక ప్రెవేటు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి.. డిజిటిల్ విధానంలో వచ్చిన మార్కులనే మాన్యువల్ లో కూడా వచ్చినట్టుగా నమోదు చేయించడం అనే డ్రామా నడిపించిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎవరీ వెంకటసుబ్బయ్య అనే చర్చ నడుస్తోంది.
గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగిన సమయానికి ఈ వెంకటసుబ్బయ్య ఎపీపీఎస్సీలో కాన్ఫిడెన్షియల్ విభాగానికి సహాయ కార్యదర్శిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గ్రూప్ 1 అక్రమాల గురించి వివరాలు సేకరించడం ప్రారంభించగానే.. ఆయన అమెరికా వెళ్లడానికి సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజే, ఏఫ్రిల్ 22న, ఆయన సెలవుపై వెళ్లారు. సెలవు ప్రకారంగా చూస్తే.. ఆయన ఈనెల 22న తిరిగి రావాల్సి ఉంది. ఆయన వచ్చాక విచారిస్తే ఈకేసులో మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అనుకుంటున్నారు.
హాయ్ ల్యాండ్ అనే ఒక ప్రెవేటు రిసార్టులో, క్యామ్ సైన్ అనే ఒక ప్రెవేటు సంస్థ ద్వారా మూల్యాంకనం చేయించడం అనేది పీఎస్సార్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా చేసిన అరాచకం అనేది స్పష్టం. ఈ అరాచకంలో ఆయనకు కీలకభాగస్వామి ఈ వెంకటప్పయ్యే! ఆయన ఆదేశిస్తే.. ఆ ప్రకారం అక్రమాలను కార్యచరణలో పెట్టింది ఆయనే అని పోలీసులు విచారణలో గ్రహించారు. క్యామ్ సైన్ మీడియా డైరక్టరుగా అరెస్టు అయిన పమిడికాల్వ మధుసూదన్ తన వాంగ్మూలంలో ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది. ‘పీఎస్సార్ వచ్చి కలవమంటున్నారు’ అంటూ మధుసూదన్ కు ఫోను చేసి పిలవడం దగ్గరినుంచి, మాన్యువల్ మూల్యాంకనం అనే ప్రహసనం నడిపించడానికి మధుసూదన్ నియమించుకున్న 66 మందికి ఓరియంటేషన్ పేరుతో.. మూల్యాంకనమే అవసరం లేదు.. డిజిటల్ లో వచ్చిన మార్కులనే ఇక్కడ కూడా వేయండి అని చెప్పింది కూడా వెంకటసుబ్బయ్యే అని తేలుతోంది. సెలవు పేరుతో అమెరికా పారిపోయిన ఆయన తిరిగి రాగానే.. అన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు ఎదురుచూస్తున్నారు.