వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ప్రకాశంజిల్లా కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా ఒకరు. వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా సన్నిహితంగా మెలిగిన నాయకుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్న మహీధర్ రెడ్డి తదనంతర పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్నారు. వైఎస్సార్ తో అనుబంధం ఉండి, వైఎస్సార్ కాంగ్రెస్ లో మిగిలిన కొద్దిమందిలో ఆయన కూడా ఒకరు. అలాంటి సీనియర్ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి ఈ విడత ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు. కందుకూరు నియోజకవర్గం నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు. ముందుగా సరైన సమాచారం కూడా ఇవ్వకుండా చాలా అగౌరవంగా టికెట్ తిరస్కరించారని మహీధర రెడ్డి వర్గం ఆవేదన వ్యక్తం చేసింది కూడా. అయితే.. ఆయన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆత్మీయ సమావేశం నిర్వహించిన నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాత్రం తన మాటలతో నవనీతం పూస్తున్నారు. మహీధర రెడ్డిని ఆకాశానికి ఎత్తేసేలా పొగుడుతున్నారు. తన మాటల మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.
విజయసాయిరెడ్డి ఇంతకూ ఏం అంటున్నారంటే.. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహీధర్ రెడ్డి మాటనే వేదంగా భావిస్తారట. ఆయన ఆలోచనలు, సూచనలను తప్పకుండా పాటిస్తారుట. తాను, తనతోపాటు మహీధర్ రెడ్డిని తోసిరాజని ఆయన అవకాశాన్ని దక్కించుకున్న ఎమ్మెల్యే కేండిడేట్ బుర్రా మధుసూదన యాదవ్ కూడా ఇలా చేస్తామని విజయసాయి అంటున్నారు. పైగా ఇలాంటి కల్లబొల్లి కబుర్లకు ‘వేంకటేశ్వర స్వామి సాక్షిగా’ అంటూ దేవుణ్ని కూడా ప్రమాణంలో ఒడ్డడం విశేషం.
మహీధర్ రెడ్డి మద్దతు లేకుంటే ఎంపీగా తన గెలుపుతో పాటు, ఎమ్మెల్యేగా బుర్రా గెలుపు కూడా అసాధ్యం అవుతుందని విజయసాయి చెబుతున్నారు. మహీధర రెడ్డి తన వర్గం అనుచరులతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశం గనుక.. ఆయన ముఖప్రీతి కోసం విజయసాయి ఇలాంటి నయవంచన మాటలు చెబుతున్నట్టుగా ఆయన అనుచరులే భావిస్తున్నారు.
మహీధర్ రెడ్డి ఆలోచనలు, సూచనలు నిజంగా అంత విలువైనవి అనే నమ్మకం ఉన్నట్లయితే ఆయనకే టికెట్ ఇచ్చి ఉండొచ్చు కదా.. అనేది అభిమానుల ప్రశ్నగా ఉంది. దీనికి విజయసాయి ఏం చెబుతారో గానీ.. విజయసాయి చెప్పినంత అనన్యమైన ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ.. జగన్ ద్వారా టికెట్ నిరాకరింపబడి.. రాజకీయాల మీదనే వైరాగ్యం పెంచుకున్న మహీధర రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి ఆర్థిక రాజకీయాల్లో తాను ముందుకు నడవలేకపోతున్నానని అనడం విశేషం. అలాగే శాసనమండలి మీద కూడా ఆసక్తి లేదని అనడం ద్వారా.. ఆయన సూచన ప్రాయంగా తన రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. ఆయన తన మాటలతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కోట్లు కుమ్మరించగలవారికి మాత్రమే టికెట్లు ఇస్తారనే భావం ధ్వనిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.