వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇది చాలా చిత్రమైన పరిస్థితి. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీలాగా ఏర్పడి.. పార్టీలో జరుగుతున్న అసలు పరిణామాలను, ప్రజల స్పందనలను ఆయన వరకు చేరనివ్వకుండా.. ఎవ్వరైతే పార్టీ వినాశనానికి కారణమవుతున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో.. వారే.. కోటరీ గురించి ఆరోపణలు చేయడం అనేది చిత్రంగా ధ్వనిస్తున్న సంగతి. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే వంటి సామెతలు కూడా ఈ వ్యవహారాన్ని పోల్చడానికి సరిపోవు. ‘కంచే కంచెను నిందించినట్టుగా..’ వంటి కొత్త సామెతలు వీరికోసం తయారు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ, ఆయనకు వాస్తవాలు తెలియనివ్వడం లేదు అంటూ.. ఇన్నాళ్లూ అదే పార్టీలో నెంబర్ టూ కుర్చీ కోసం కొట్టుకుంటూ గడిపిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం.. ఆ పార్టీలో ఉన్న దుస్థితిని తెలియజేస్తోంది
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకు అధికారం దక్కేవరకు ప్రజల మధ్యలో తిరుగుతూ వారికి ముద్దులు పెట్టుకుంటూ నిత్యం ప్రజల మనిషిలాగా కనిపిస్తూ వ్యవహరించారు. అయితే.. ‘ఒక్కచాన్స్’ అనే మంత్ర ప్రయోగం ఫలించి ముఖ్యమంత్రి పీఠం దక్కిన తర్వాత.. ఆయన తీరు మారిపోయింది. తనను తాను తెలుగు రాష్ట్రానికి చక్రవర్తిగా ఊహించుకుంటూ.. కోటకు పరిమితమైపోయి ప్రజల మధ్యలోకి రాకుండా, కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను కూడా కలవకుండా రాజ్యం చేశారు. ఆయనతో ఎవరు ఏం మొరపెట్టుకోవాలన్నా కూడా.. ఆయన పనుపున పనిచేసే ఇతర వ్యక్తులకు మొరపెట్టుకోవాల్సి వచ్చేది. వారు తమ తమ ప్రయోజనాలను బేరీజు వేసుకుని, ఫిల్టర్ చేసిన సంగతులను మాత్రమే పార్టీ అధినేతకు చెబుతూ వచ్చేవారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. జగన్ చుట్టూ ఒక కోటరీ ఏర్పడి ఆయనకు ఏ విషయమూ తెలియనివ్వడం లేదని పార్టీలో ఉన్న నాయకులే తమ ప్రెవేటు సంభాషణల్లో ఆవేదనలు వ్యక్తం చేసేవారు. రఘురామక్రిష్ణ రాజు ఆ పార్టీ ఎంపీగా ఉంటూ విభేదించి.. తిరుగుబాటు చేసి సంచలనంగా మారడానికి ఆ కోటరీనే కారణం. అలాగే పార్టీలో ఉంటూ తమ ఆవేదన బహిరంగంగా చెప్పుకున్న వారు కూడా ఉన్నారు. చాలా మంది పార్టీని వీడిపోతున్న సమయంలో కోటరీ గురించి ఆరోపణలు చేసి వెళ్లిపోయారు. అలాంటి వారందరి ఆరోపణల్లో- కోటరీ వ్యక్తులుగా వినిపించిన పేర్లలో విజయసాయిరెడ్డి కూడా ఒకరు.
ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి పార్టీనుంచి బయటకు వెళ్లిపోయారు. తాజాగా ఆయన జగన్ చుట్టూ ఏర్పడిన కోటరీ కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగిపోయిందని అంటున్నారు. పైగా, ఆ కోటరీనుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందని కూడా విజయసాయి మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నారు.
జగన్ ను కలవాలంటే.. ఈ కోటరీకి లాభం చేకూర్చాలి- అనే విజయసాయి ఆరోపణ నవ్వు తెప్పిస్తుంది. గతంలో అనేకమంది విజయసాయి మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ‘నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వినకూడదు’ అని విజయసాయి చెబుతున్న మాటల్ని గమనిస్తే.. ఆయన నిష్క్రమణ పర్వం వెనుక.. పార్టీలో చాలా తతంగమే నడిచినట్టుగా కనిపిస్తోంది.