వారెవ్వా.. కాకాణి డైవర్షన్ పాలిటిక్స్ !

మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి తన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ నేపథ్యంలో తనమీద ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో, వాటి మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆయన తెలివైన ఎత్తుగడను అనుసరిస్తున్నారు. ఆయనపేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కల బెంజ్ కారు బెంగళూరు డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ కారు తనదే అని నిరూపిస్తే గనుక ఎలాంటి సవాలుకైనా తాను సిద్ధమేనని కాకాని గోవర్ధన రెడ్డి అంటున్నారు.

బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, దానితో తనకు సంబంధం లేదని, కావాలంటే తన బ్లడ్ శాంపిల్స్ కూడా పరీక్షకు ఇస్తానని.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా బ్లడ్ శాంపిల్స్ పరీక్షకు ఇస్తారా? అని కాకాణి గోవర్ధన్ రెడ్డి చాలా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. అయితే నిజానికి ఆయన బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారని ఎవరూ అనడం లేదు. ఆ పార్టీ నిర్వాహకులలో ఒకరైన బెంజ్ కారు యజమాని కాకాని గోవర్ధన్ రెడ్డికి సన్నిహితుడని, కాకాని ద్వారా ఎమ్మెల్యే స్టికర్ పుచ్చుకొని అధికార దందా చలాయించగలిగేంత సన్నిహితుడని మాత్రమే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి డ్రగ్ రాకెట్ వెనుక కాకాణి గోవర్ధన రెడ్డి లాంటి రాజకీయ ప్రముఖుల అండదండలు ఉన్నాయనే వాదన మాత్రమే వినిపిస్తున్నది.

ప్రజలు సూటిగా తన మీద వస్తున్న ఆరోపణ గురించి ఆలోచించకుండా చేయడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శలను తిప్పి కొడుతున్నారు. రాజకీయ నాయకులకు చాలా అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ మార్గాన్ని అనుసరిస్తున్నారు. విమర్శలు ఒకవైపు వస్తుంటే ఆయన మరొకవైపు కౌంటర్లు సంధిస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ ఇస్తా లాంటి అతిశయమైన మాటల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గమనించాల్సిన ఇంకో సంగతి ఏంటంటే.. బెంగుళూరు రేవ్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకాణి గోవర్దన్ రెడ్డికి అండగా నిలబడడం లేదు. ఆయన మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని పార్టీ తరఫున ఎవ్వరూ తమ గళం వినిపించడం లేదు. ఈ విషయంలో తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో కాకాణి ఒంటరైపోయారనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ నాయకులు అందరూ కూడా.. ప్రస్తుతం మాచర్ల పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నారని కూడా అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories