జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలను శాసించాలని చూడడం మాత్రమే కాదు.. కుటిల రాజకీయ బుద్ధులను అతి తెలివితో ప్రదర్శిస్తున్నారు! రాష్ట్రంలో అకాల వర్షాల నేపథ్యంలో అన్నదాతలకు నష్టం వాటిల్లిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను ప్యాలెస్ నుంచి అడుగు బయటకు పెట్టలేదు గానీ, తన పార్టీ నాయకులు శ్రేణులు అందరూ నష్టపోయిన రైతుల ఇండ్లకు వెళ్లి వాళ్లను పరామర్శించారని, వాళ్లకు ధైర్యం చెప్పాలని ప్రభుత్వ సాయం త్వరగా అందేలాగా పోరాడాలని మార్గదర్శనం చేస్తున్నారు.
అయినా ఆయన ప్రభుత్వం సాగుతున్నప్పుడు ఇలా ఆయన పార్టీ కార్యకర్తలు నష్టపోయిన రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్ళ కష్టాలు తెలుసుకుని ప్రభుత్వ సాయం అందేలా కోఆర్డినేట్ చేసి ఉంటే మర్యాదగా ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సాగుతుండగా జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో ఆడిస్తున్న డ్రామాలు వికటంగా కనిపిస్తున్నాయి. ఇదొక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రకం పురమాయింపు ద్వారా తన అతి తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు- అని ప్రజలు అనుకుంటున్నారు.
ఎందుకంటే ఇవాళ్టి భారీ వర్షాలు మాత్రమే కాదు కదా.. అలాంటి ప్రకృతి వైపరీత్యం ఏదైనా సరే జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన ఏ సందర్భంలోనైనా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఆయన ఏ స్థాయిలో స్పందిస్తారో, ఎంత చురుగ్గా సహాయక చర్యలు చేపడతారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా బాగా తెలుసు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు గనుక, వర్షాలు తెరిపించి ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలకు రంగంలోకి దిగేలోగా.. తమ పార్టీ వారిని రైతులు ఇండ్లకు పంపాలని దుర్బుద్ధితో కూడిన వ్యూహరచన చేసినట్లు ప్రజలకు అనిపిస్తున్నది. తద్వారా తాము రైతులకు అండగా నిలబడి డిమాండ్ చేసినందు వల్ల మాత్రమే ప్రభుత్వం సాయం చేసినట్లుగా తప్పుడు బిల్డప్పులతో మైలేజీ కోసం ఆయన ఆరాటపడుతున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ భారీ వర్షాల నష్టం విషయంలో చాలా అద్భుతంగా స్పందిస్తున్నది. నష్టపోయిన రైతులందరికీ పంట పెట్టుబడి సాయం మంగళవారం సాయంత్రంలోగా అంది తీరాలి అని చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో విస్పష్టంగా ఆదేశించారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు కూడా తక్షణ సాయం అందాలని చెప్పారు. పిడుగుపాటుకు మరణించిన పశువుల బదులుగా కొత్త పశువులను అందించాలని కూడా సూచనలు జారీ అయ్యాయి. ఇలా ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతుండగా.. తాను డిమాండ్ చేయడం వల్ల మాత్రమే ఇదంతా జరుగుతున్నదని చెప్పుకోవడానికి జగన్ తన పార్టీ వారితో ఈ డ్రామా నడిపిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.