వారెవ్వా.. అయినోళ్లకు దోచిపెట్టడం అంటే ఇది కదా..?

జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన అయిదేళ్లలో అయినవారికి విచ్చలవిడిగా దోచిపెట్టారనే సంగతి ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టే.. 151 సీట్లు గెలిచిన పార్టీ ఐదేళ్లలో 11కు పడిపోయింది. ప్రజలు అంతగా ఛీ కొట్టారు. దోచిపెట్టిన సంగతి తెలుసుగానీ.. ఏ స్థాయిలో.. ఎంత అరాచకంగా అనేది ప్రజలకు తెలియదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత ఆ వివరాలు కూడా ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే ముసుగులో.. సొంత పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు పనులేమీ చేయకుండానే విచ్చలవిడిగా బిల్లులు విడుదల చేసేసిన వైనం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.

ఒక్క తిరుపతి జిల్లాలోనే లెక్క తీస్తే.. కేవలం ఈ పక్కాఇళ్ల కాంట్రాక్టర్లకు ఇప్పటికే వంద కోట్ల రూపాయలకు పైగా దోచిపెట్టినట్టు తేలుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లెక్కతీస్తే ఈ అవినీతి వ్యవహారం ఎన్ని వేల కోట్లకు చేరుకుంటుందో కదా అని ప్రజలు విస్తుపోతున్నారు.

పేదలకు పక్కాఇళ్లు అనే మాయమాట చెప్పిన జగన్.. వారికి మూడు ఆప్షన్లు ఇచ్చారు. ప్రభుత్వం బిల్డింగ్ మెటీరియల్ సప్లయి చేస్తుంది.. నిర్మాణ ఖర్చులు వారే భరించాలి. రెండో ఆప్షన్లో మెటీరియల్ కూడా ప్రజలు కొనుక్కుని బిల్లులు పెట్టవచ్చు. మూడో ఆప్షన్ లో తమకు శక్తి లేదని చేతులెత్తేస్తే ఇల్లు మొత్తం ప్రభుత్వమే కట్టి ఇస్తుంది.

కాగా, ఒక్క తిరుపతి జిల్లాలోనే ఈ మూడో ఆప్షన్ కింద ఇళ్లు నిర్మించుకోవడానికి 21,648 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని వైసీపీకి చెందిన నాయకులకే కాంట్రాక్టులు అప్పగించారు. ఈ ఇళ్లు మొత్తం పూర్తయితే 389.68 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా కేవలం 2151 ఇళ్లను మాత్రమే పూర్తిచేశారు.  కానీ ఇప్పటికే 354.54 కోట్ల రూపాయల బిల్లులు వారికి విడుదల అయిపోయాయి. ఆ మాత్రం డబ్బులు విడుదలయ్యాక నిర్మాణాలన్నీ పూర్తయి ఉండాలి. కానీ.. బేస్ మెంట్ మాత్రం పడి, అంతకంటె తక్కువ నిర్మాణం మాత్రమే జరిగిన ఇళ్లు 10,746 ఉన్నాయి. అంటే ‘ఇది ఇల్లు’ అనే ఆకారం కూడా ఏర్పడకముందే.. పూర్తి బిల్లులు చెల్లించేసిన ఘోరాలు చాలా ఉన్నాయన్నమాట. ఇలా దాదాపు వందకోట్లరూపాయలకు పైగా సొంత పార్టీ కాంట్రాక్టర్లకు నజరానా సమర్పించేసుకున్నారు.

ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంకోసమే కాంట్రాక్టర్లకు ముందుగా బిల్లులు చెల్లించినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగనన్న ఇళ్ల నిర్మాణంలో ఘోరాలను తవ్వి వెలికితీస్తే చాలా మంది పెద్దతలకాయలు కటకటాల వెనక్కు పోవాల్సి వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories