వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల వేదనలు చెప్పనలవి కాదు. వారిని ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధించవచ్చునో అన్ని రకాలుగానూ వేధించింది. తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడిగినందుకు వారి మీద రకరకాల కేసులు పెట్టారు. జగన్ ను నమ్మినందుకు చివరికి వారికి వేదన మాత్రమే మిగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారిగా సిపిఎస్ ఉద్యోగుల వదనాలలో చిరునవ్వులు విరుస్తున్నాయి. తమకు న్యాయంగా దక్కవలసినదే అయినప్పటికీ గత ఐదేళ్ల కాలంలో ఎన్నడూ సకాలంలో దక్కించుకో లేకపోయిన- ఆ ఉద్యోగులు ప్రభుత్వం తరఫు మ్యాచింగ్ ప్లాంటును కూటమి ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేకుండా ఒకేసారిగా పూర్తిగా చెల్లించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిపిఎస్ ఉద్యోగులతో జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక స్థాయిలో ఆడుకున్నారనే సంగతి అందరికీ తెలుసు. ఏదో ఒక రకంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి ఎట్టి పరిస్థితులలోను అధికారంలోకి రావాలని కలలుగన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను పాదయాత్ర చేసిన కాలంలో సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన వంచనాత్మకమైన హామీ.. వారికి పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తానని చెప్పడం. పరిపాలన గురించి గానీ ప్రభుత్వ వ్యవస్థ గురించి గానీ ఒక హామీ ఇచ్చే ముందు దాని వలన ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో.. ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడుతుందో అనే దిశగా కనీసం జ్ఞానం కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి- తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం వారం రోజుల వ్యవధిలో సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరిస్తానని ఒక బూటకపు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ ఎంతటి అసాధ్యమైనదో ఆయనకు అర్థమైంది. జగన్ మాట నిలబెట్టుకుంటారు అని సుదీర్ఘకాలం నిరీక్షించిన సిపిఎస్ ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేయడం ప్రారంభించిన తర్వాత.. ప్రత్యామ్నాయంగా జిపిఎస్ పింఛన్ ఇస్తానని మాయమాటలు చెబుతూ మంత్రులు కమిటీని వేసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులను తీవ్రంగా అవమానించేలా భేటీలు నిర్వహించారు. తమకు ఇచ్చిన హామీ గురించి కోరుతున్నామే తప్ప అదనంగా ఏమీ అడగడం లేదని సిపిఎస్ ఉద్యోగులు ఎంతగా మొరపెట్టుకున్నా ఆలోచించలేదు. దీక్షలు చేస్తే అరెస్టులు చేయించారు. మొత్తానికి ఆయన ప్రభుత్వం పతనమైన తరువాత చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్ డి ఏ కూటమి సర్కారు ఏర్పడింది.
గత 17 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా సిపిఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంటును ఏ మాత్రం బకాయిలు లేకుండా వారి ప్రాన్ ఖాతాలకు ఒకేసారి చెల్లించింది కూటమి ప్రభుత్వం. గతంలో ఎప్పుడూ కూడా కనీసం 12 నెలల బకాయిలు ఉంటూనే వచ్చేవి. ఇప్పుడు ఒకేసారిగా దాదాపు 2,300 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ను ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలకు చెల్లించింది.
ఈ చర్య వలన వారికి భవిష్యత్తులో అందబోయే పింఛన్లలో భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వారి ఖాతాల్లోని మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి పదవీ విరమణ తర్వాత వాటిపై వచ్చే ఆదాయం నుంచి పెన్షన్ చెల్లిస్తారు. ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ లో జాప్యం చేయడం వలన మార్కెట్లోకి వారి వాటా పెట్టుబడులు బాగా తగ్గిపోయేవి. తదనగుణంగా వారు పొందగల లాభాలు దానినిబట్టి వారికి ఏర్పడగల పింఛను అన్నీ తగ్గిపోయేవి. అందువల్ల సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించడం అనేది సిపిఎస్ పింఛను దారులకు నిజంగానే ఒక గొప్ప వరం అని పలువురు భావిస్తున్నారు.