వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల నుంచి మీడియా ముందుకు వచ్చినా, కూటమి ప్రభుత్వం మీద బురదచల్లుడు ప్రారంభించినా.. వారి తిట్ల పురాణానికి మూలాలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లోనే కనిపిస్తుంటాయి. ఈ విధానం ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో వైఎస్ జగన్ అధికారం చెలాయిస్తున్నప్పుడు కూడా ఇలాగే జరుగుతూ వచ్చింది. రాష్ట్రంలో నాయకులు, మంత్రులు ఎవరు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా.. స్క్రిప్టులు తాడేపల్లినుంచి, సీఎంవో నుంచి వెళ్లేవి. నాయకులు ప్రెస్ మీట్ కు అందరినీ పిలిచేసి, మీడియా వాళ్లంతా వచ్చినా తర్వాత.. స్క్రిప్టు కోసం ఎదురుచూస్తూ.. పిచ్చాపాటీ మాట్లాడుతూ గడిపిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
అలాంటి తాడేపల్లి మూలాలు ఇప్పుడు అధికారికంగా.. కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం కనిపిస్తోంది. అమరావతి మునిగిపోతున్నది అన్నట్టుగా, అమరావతిని ముంచకుండా చూడడం కోసం పొన్నూరును ముంచేశారన్నట్టుగా.. పొన్నూరు వైసీపీ ఇన్చార్జి అంబటి మురళీ కృష్ణ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తే.. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను బట్టి మాట్లాడానని, పార్టీ పెద్దల ఆదేశాల మేరకు మాట్లాడానని అంబటి మురళీకృష్ణ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడు ఆ తెరవెనుక ఉండి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడించిన పార్టీ పెద్దలు ఎవ్వరో ఆరా తీసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇటీవల కాస్తంత వర్షాలు వచ్చి గ్రామీణ ప్రాంతాలు జలమయం అయిన వెంటనే.. వైసీపీ నీలిదళాలు రంగంలోకి వచ్చాయి. ‘అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారు’ అంటూ ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి అంబటి మురళి అన్నారు. ఆ వ్యాఖ్యల్ని సాక్షి సహజంగానే పతాకశీర్షికల్లో ప్రచురించింది. తీరా పోలీసులు పిలిచి విచారిస్తే అంబటి అన్నీ డొంకతిరుగుడు జవాబులే చెప్పారు. ఆయన చేసిన ఆరోపణల గురించి ఎలా చేయగలిగారు? అవన్నీ ఆయన చూశారా? అసలు ఎంత వర్షపాతం పడిందో మీకు తెలుసా? వంటి ఏ ప్రశ్నలు అడిగినా కూడా అంబటి డొంకతిరుగుడు జవాబులే చెప్పారు.
అంబటి నిరాధారంగా కొన్ని నిందలు వేయడం.. వాటిని పనిగట్టుకుని పతాకశీర్షికల్లో పెట్టి విస్తృతంగా ప్రచారం కల్పించడం అనేది సాక్షి తన తరహాగా మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని అంబటితో చెప్పిన పోలీసులు.. సాక్షి యాజమాన్యానికి కూడా నోటీసులు విచారణకు పిలవాలని అనుకుంటున్నారు.
అంబటి మాత్రం రాజధాని నిర్మాణం భద్రంగా జరగాలనే కోరిక తప్ప.. ఈ వ్యాఖ్యల వెనుక తనకు ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసులతో అన్నారు. మరి.. ఆయనతో ఈ వ్యాఖ్యలు చేయించడంలో దురుద్దేశం ప్రదర్శించిన పార్టీ పెద్దలు ఎవరో లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది కదా అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.