విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ద్వారా ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ సీటు ఎవరికి దక్కబోతోంది? 22వ తేదీ నుంచి నామినేషన్లు వేయడానికి అవకాశం మొదలుకాగా ఈ సీట్ కి ఎవరిని ఎంపిక చేస్తున్నారనేది ఇంకా నిర్ణయం కాలేదు. కూటమి పార్టీలలో ఒకరికి దక్కుతుంది అనేది ఖరారు. అయితే రాజ్యసభలో పరిమితమైన బలాన్ని కలిగి ఉన్న దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ఈ సీటును కూడా ఆశిస్తున్నట్లుగా, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సుముఖంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కమల నేతలు ఈ ఒక్క సీటుకు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించి, ఇటీవల రాజీనామా చేసిన అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని బిజెపి తలపోస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ కార్యరూపం దాల్చే వరకు అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఆయన మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి తన ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి అమిత్ షా తోను, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనూ ఆయన ఢిల్లీలో సమావేశం అయ్యారు. తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లుగా తెలుస్తోంది. బిజెపికి కేటాయించిన తర్వాత వారి నిర్ణయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం చంద్రబాబుకు లేదని సమాచారం.
అదే సమయంలో మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా బిజెపి ఆశావహుల జాబితాలో వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఏపీలో ఇటీవల కాలంలో పుకార్లు వచ్చిన విధంగా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని బిజెపి రాజ్యసభకు పంపించడం మాత్రం జరగదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అన్నామలై తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి చాలా సేవ చేశారు. స్థానికంగా అన్నా డీఎంకే నేతలతో ఉన్న విభేదాలు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని అధిష్ఠానం కోరుకుంటుండడం నేపథ్యంలో ఆయన రాష్ట్ర సారథ్య బాధ్యతలకు రాజీనామా చేశారు. అప్పటినుంచి సైలెంట్ గానే ఉన్నారు. కానీ ఆయన ఇన్నాళ్లూ పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఎంపీ పదవి కట్టబెట్టాలని పార్టీ అనుకుంటోంది. అదే సమయంలో మంద క్రిష్ణ కూడా ఎంపీ పదవిని గట్టిగా కోరుకుంటున్నారు. తన జీవితంలో సుదీర్ఘకాలం ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడడంలోనే గడిపిన మందకృష్ణకు తెలుగు రాష్ట్రాలనుంచి పలువురు బిజెపి నాయకుల మద్దతు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.