సాధారణంగా రాజకీయ నాయకులు తమ గురించి, తమ పార్టీ గురించి ఏదైనా దుష్ప్రచారం సోషల్ మీడియాలో జరిగితే సీరియస్ గా తీసుకుంటారు. వాటి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అధికార పార్టీ మీద సోషల్ మీడియాలో అలాంటి తప్పుడు ప్రచారం జరిగితే గనుక వారి మీద అనేక రకాల కేసులు బనాయించి చిత్రవధకు గురి చేయడం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాం. సోషల్ మీడియా లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టేవారిని వేధించడానికి జగన్ సర్కారు ప్రత్యేక చట్టాలు తెచ్చింది కూడా! అయితే కేవలం రాజకీయ దూషణలు విషయంలో మాత్రమే కాకుండా.. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే ప్రతి సందర్భంలోనూ కొరడా ఝులిపించడం అవసరం.
తిరుమల తిరుపతి దేవస్థానాల గురించిన అసత్య ప్రచారం చాలా సీరియస్ విషయం. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది హిందూ భక్తుల నమ్మకాలను ప్రభావితం చేసే దుష్ప్రచారం ఇది. తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలు 300 నుంచి 200 కు తగ్గించారని, అదనపు లడ్డూల ధర 50 నుంచి 25 కు తగ్గించారని సోషల్ మీడియా లో బాగా ప్రచారం జరిగింది. టీటీడీ ఈ ప్రచారాన్ని ఖండించింది. అలాంటి ఆలోచన లేదని తెలిపింది. అక్కడితో ఈ వివాదం సమసిపోయింది. అక్కడితో ప్రభుత్వం ఊరుకోకూడదు.
అసలు ఇలాంటి కుట్ర ప్రచారం ఎక్కడ పుట్టిందో పోలీసులు కనిపెట్టాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికి జరిగిన కుట్ర. ఇలాంటి కుట్రపూరిత ప్రచారాలను మొగ్గలోనే తుంచేయకపోతే చాలా ప్రమాదం. అందుకే తిరుమల గురించి తప్పుడు ప్రచారాలను పుట్టించిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి.