వారు చేసేది అబద్ధాల ప్రచారం. బురదచల్లుడు అనే యజ్ఞం! ప్రజలను మభ్యపెట్టడమే వారికి తెలిసిన ఏకైక రాజకీయ విధానం. తాము చెబుతున్నది అబద్ధాలని ప్రజలు గుర్తించేదాకా వారు విచ్చలవిడిగా అదే పనిగా గోబెల్స్ ప్రచారం సాగిస్తూ ఉంటారు.. ఒకసారి ప్రజలకు విషయం తెలిస్తే చాలు.. అక్కడితో సైలెంట్ అయిపోతారు. అప్పటిదాకా చల్లిన బురద ద్వారా దక్కే వక్రప్రయోజనాలు చాల్లే అనుకుంటారు. అలాంటి బుద్ధితోనే వైఎస్సార్ సీపీ, జగన్ దళాలు ఇవాళ రాజకీయం చేస్తున్నాయి. విశాఖపట్నం నగరానికి ఏఐ, ఐటీ డేటా సెంటర్ లను తీసుకురావడానికి ఉర్సా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటూ ఉండగా.. అలాంటి సంస్థలు రావడం వల్ల ప్రభుత్వానికి కీర్తి, యువతరానికి ఉద్యోగాలు వస్తాయని వైసీపీ వారు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండూ జరగకుండా అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు. అయితే వారి విషప్రచారాలన్నీ అబద్ధాలన్నీ అబద్ధాలని ప్రజలు గుర్తించిన తర్వాత.. కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోతున్నారు.
ఉర్సా సంస్థకు మూడువేల కోట్ల రూపాయల భూమిని ఎకరా 99 పైసల వంతున ఇచ్చేస్తున్నట్టుగా.. వైసీపీ దళాలు ఎంతగా దుష్ప్రచారం సాగించాయో అందరికీ తెలుసు. ఉర్సా మీద విరుచుకుపడడంలో ఆ పార్టీలోని వారందరూ పోటీలు పడ్డారు. సాక్షి దినపత్రిక, చానెళ్లలో వరుస కథనాల్ని వండి వార్చారు. దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోతే అధినేతకు కోపం వస్తుందనే స్థాయిలో పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా విమర్శల జడివాన కురిపించారు. కానీ.. ఉర్సాకు స్థలం కేటాయింపులో ఎలాంటి అక్రమాలు లేదని, 99 పైసలకు ఎకరా ఇవ్వడం ఒట్టి అబద్ధం అని తేలిపోయింది.
విశాఖ మధురవాడలోని ఐటీ హిల్స్ లో ఎకరా రూ.కోటి వంతున 3.5 ఎకరాలు, కాపులుప్పాడులో ఎకరం రూ.50 లక్షల వంతున 56.5 ఎకరాలను ప్రభుత్వం ఉర్సాకు కేటాయించింది. అయితే ఇందుకు అనేక నిబంధనలు కూడా ఉన్నాయి. ఏపీ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఆ సంస్థ పేరుతో సేల్ డీడ్ చేస్తాం అని కూడా ఒప్పందంలో ఒక భాగంగా పేర్కొన్నారు. వాస్తవం ఇది కాగా.. జగన్ దళాలు మాత్రం అదే పనిగా తప్పుడు ప్రచారం సాగించాయి.
ఉర్సా సంస్థ సాక్షి మరియు వైసీపీ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ఈలోగా వారితో ఒప్పందం అసలు వివరాలన్నీ బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారి నీలి దళాలు తోకముడిచాయి. ఈ టాపిక్ ఎత్తకుండా సైలెన్స్ పాటిస్తున్నాయి. చల్లినంత బురద చల్లేసి.. ఇప్పుడు ఇలా వెనక్కు తగ్గడాన్ని నిజం తెలిసిన ప్రజలు అసహ్యించుకుంటున్నారు.