పోలింగ్ కాగానే.. బైబై చెప్పనున్న జగన్!

అయిదేళ్లు పాటు అభివృద్ధి అంటే ఏమిటో తెలియనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి బైబై చెప్పాలంటూ.. అటు తెలుగుదేశం పార్టీ,ఇటు జనసేన పార్టీ వేర్వేరు నినాదాలు రూపొందించుకుని విస్తృతంగా ప్రచారం చేశాయి. వారి మాట విని రాష్ట్రప్రజలు జగన్ కు బైబై చెప్పడానికి ఉద్యుక్తులు అవుతున్నారని ఆయనకు సమాచారం అందినట్టుంది. ముందే తాను రాష్ట్రానికి బైబై చెప్పడానికి జగన్ సిద్ధమవుతున్నారు. పోలింగ్  ముగిసిన తర్వాత ఈనెల 17న జగన్ సకుటుంబంగా విదేశీయాత్రకు వెళ్లనున్నారు. ఫలితాలు వెలువడడానికి ముందు.. అంటే జూన్ 1వ తేదీనాటికి ఆయన తిరిగివచ్చే అవకాశం ఉంది.

జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అవినీతి అక్రమార్జనల కేసుల్లో నిందితుడిగా ఉంటూ బెయిలుపై బయట ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. బెయిలుపై బయట ఉన్న నాయకుడిగానే ఆయన ఒక టర్మ్ పూర్తిగా అయిదేళ్లపాటు ముఖ్యమంత్రిత్వాన్ని కూడా వెలగబెట్టారు. ఆయన పాలన మీద ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలున్నాయి.
సంక్షేమ పథకాల పేరుతో అప్పులు తెచ్చిన డబ్బును ప్రజలకు పంచిపెట్టడం తప్ప జగన్ చేసిన నిర్దిష్టమైన అభివృద్ధి ఇసుమంతైనా లేనేలేదని విమర్శలున్నాయి. 2014 తరహాలోనే ఎన్డీయే కూటమిగా తెలుగుదేశం, బిజెపి, జనసేన జట్టుకట్టి బరిలోకి దిగి జగన్ ను ఓడించడానికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నాయి. ఆయన ఓటమి ఖరారైనట్టేనని, జగన్ ను ఇంటికి పంపడానికి ఏపీ ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారని.. ప్రధాని మోడీ సహా పలువురు బలంగా నమ్ముతున్నారు- అంటున్నారు. కాగా.. ప్రజలు తనకు బైబై చెప్పడానికంటె ముందే జగనే తాను బైబై చెప్పబోతున్నారు. బెయిలు మీద ఉన్న వ్యక్తి కావడం వలన.. తాను యూరప్ యాత్ర వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన యాత్రకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తే.. జెరూసలెం, స్విట్జర్లాండ్, లండన్ లలో ఆయన పర్యటించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ కూతుళ్లు లండన్ లో చదువుతున్నారు.

ఆయన విజ్ఞప్తి పట్ల న్యాయమూర్తి సీబీఐను అభ్యంతరాల గురించి అడిగారు. సీబీఐ తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లయితే.. జగన్ విదేశాలకు వెళ్తారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories