‘‘అబ్బెబ్బే.. మేం ఒక్క డిస్టిలరీ కి కూడా కొత్తగా అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలోనే 34 కొత్త డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారు. మా పరిపాలన కాలంలో ఒక్క కొత్త దానికి కూడా అనుమతి ఇవ్వలేదు. వాటి ద్వారా తయారైన మద్యం మాత్రమే విక్రయించాం. కాబట్టి మేము పరిశుద్ధాత్మ స్వరూపులం కింద లెక్క’’ అన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానం గురించి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటో ఇప్పుడు సిఐడి దర్యాప్తులో బయటపడుతుంది. జగన్ పరిపాలన కాలంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటివి చంద్రబాబు అనుమతించిన డిప్టిలరీలే కావచ్చు కానీ.. జగన్ హయాంలో లీజుల పేరుతో అవి చేతులు మారాయి. జగన్ దళాలకు చెందిన బినామీ నాయకులే వాటిని సొంతం చేసుకున్నారు. బడా నాయకులు తెరవెనుక ఉండి.. వ్యాపారం నడిపించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఉండే ఎస్వీఆర్ డిస్టిలరీస్ లో సిఐడి పోలీసులు కూలంకషంగా ఆధారాలు సేకరించి విచారణ చేపడుతున్న నేపథ్యంలో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరుల పేరుతో ఈ ఎస్వీఆర్ డిస్టిలరీస్ యాజమాన్యం లీజు కింద చేతులు మారింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త మద్యం విధానం తీసుకువచ్చి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటుచేసిన తర్వాత మాత్రమే ఇలా చేతులు మారడం గమనార్హం.
ఈ ఎస్వీఆర్ డిస్టిలరీస్ నుంచి గత ఐదేళ్లలో జరిగిన మద్యం తయారీ, సరఫరా, ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపులు వివరాలు, మద్యం సీసాల పై అతికించడానికి తయారు చేసిన లేబుల్లు పక్కదారి పట్టిన వైనం ఇలాంటి అన్ని అంశాలను సిఐడి అధికారులు పరిశోధిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉత్పత్తికి సరఫరాకు సంబంధించిన పూర్తి రికార్డులను అధికారులు సీజ్ చేశారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకుని.. రికార్డులతో పాటు విజయవాడకు తీసుకువెళ్లి వాటిని పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి కాలంలో దందా అనేది ఎలా సాగిందో నెమ్మదిగా బయటకు వస్తుంది. జగన్ తనంతటి నిష్కళంకుడు లేడు అన్నట్లుగా తన పరిపాలనలో ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు అని చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే జరిగింది ఏమిటంటే అప్పటికే ఉన్న డిస్టిలరీలను బెదిరించి వాటి యాజమాన్యాలను తమ తైనాతీల పేరిట బినామీలుగా తీసుకోవడం మాత్రమే. తద్వారా వైసిపి యాజమాన్యంలోకి మారిన డిస్టిలరీల్లో తయారయ్యే మద్యాన్ని మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించారు. పది సీసాలు అమ్మితే ఒక సీసాకు లెక్క రాయడం లాంటి దుర్మార్గపు పోకడలను అనుసరిస్తూ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సిఐడి దర్యాప్తు డిస్టిలరీస్ మీదకు కూడా సాగుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం పాల్పడిన సకల అరాచకాలు ఒక్కటొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంది.